పెయింట్‌లోనే ఏఐ!

పదాల కూర్పుతో (ప్రాంప్ట్‌) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్‌ఇన్‌ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు

Published : 28 Feb 2024 00:36 IST

పదాల కూర్పుతో (ప్రాంప్ట్‌) ఇమేజ్‌లు సృష్టించటం ఇటీవల చాలా తేలికైంది. ఇందుకోసం జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లోకి వెళ్లి, సైన్‌ఇన్‌ అయ్యి ఇష్టమైన ఇమేజ్‌లను ఇట్టే సృష్టించుకోవచ్చు. చందా కడితే మరింత ఎక్కువ ఇమేజ్‌లనూ పొందొచ్చు. కానీ కొందరికి ఈ టూల్స్‌ వాడటం, డబ్బులు కట్టటం  ఇష్టం లేకపోవచ్చు. ఇలాంటివారు విండోస్‌ 11లోని అధునాతన పెయింట్‌ అప్లికేషన్‌ను ప్రయత్నించొచ్చు. దీనికి కొత్తగా కోక్రియేటర్‌, లేయర్స్‌ అనే ఫీచర్లు తోడయ్యాయి మరి.

కోక్రియేటర్‌ ఫీచర్‌ డాల్‌-ఇ ఇమేజ్‌ జనరేటర్‌ సాయంతో పనిచేస్తుంది. మనకు నచ్చినట్టుగా ఇమేజ్‌లను సృష్టించటం దీని ప్రత్యేకత. ముందుగా మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌లో లైబ్రరీ ద్వారా గెట్‌ అప్‌డేట్స్‌లోకి వెళ్లి పెయింట్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. తర్వాత ఉపయోగించు కోవచ్చు. ఇంతకీ దీన్ని ఎలా వాడుకోవాలంటే?

  • పెయింట్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, రిబ్బన్‌లో కనిపించే కోక్రియేటర్‌ ఫీచర్‌ను ఎంచుకోవాలి.
  •  టెక్స్ట్‌ బాక్సులో మనకు ఎలాంటి ఇమేజ్‌ కావాలో పదాల రూపంలో వర్ణించాలి.
  •  అనంతరం బాక్సు కింద ఉండే నో సెలక్షన్‌ మీద క్లిక్‌ చేసి, స్టైల్‌ను ఎంచుకోవాలి. ఇందులో చార్‌కోల్‌, ఇంక్‌ స్కెచ్‌, వాటర్‌ కలర్‌, ఆయిల్‌ పెయింటింగ్‌, డిజిటల్‌ ఆర్ట్‌, ఫొటోరియలిస్టిక్‌ వంటి స్టైళ్లు ఉంటాయి. వీటిల్లో ఇష్టమైనదాన్ని నిర్ణయించుకొని, క్రియేట్‌ మీద క్లిక్‌ చేయాలి.
  •  ఇచ్చిన వివరణకు అనుగుణంగా పెయింట్‌ మూడు ఇమేజ్‌లను ముందుంచుతుంది. ఏ ఇమేజ్‌ మీద క్లిక్‌ చేస్తే అది కాన్వాస్‌ మధ్యలో ప్రత్యక్షమవుతుంది. వీటిల్లో ఏదో ఒకటే నచ్చింది. కానీ దేన్ని వాడుకోవాలో తేల్చుకోలేనప్పుడు పైన గ్రహణం గుర్తు మీద క్లిక్‌ చేసి, సేవ్‌ ఇమేజ్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడవి కంప్యూటర్‌లో సేవ్‌ అవుతాయి.
  • ఒకవేళ ఏఐ జనరేట్‌ చేసిన ఇమేజ్‌ నచ్చకపోతే వివరణను అప్‌డేట్‌ చేసుకొని లేదా వేరే ఇమేజ్‌ స్టైల్‌ను ఎంచుకొని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకొని క్రియేట్‌ బటన్‌ మీద నొక్కితే కొత్త ఇమేజ్‌లు కనిపిస్తాయి. రంగులు, డ్రా ఆకారాల వంటి సంప్రదాయ టూల్స్‌నూ మార్పుల కోసం వాడుకోవచ్చు. టెక్స్ట్‌నూ జోడించుకోవచ్చు.
  •  ఇమేజ్‌ను తయారుచేయటం పూర్తయ్యాక ఫైల్‌ ద్వారా సేవ్‌యాజ్‌లోకి వెళ్లి పీఎన్‌జీ, జేపీజీ, బీఎంపీ, జిఫ్‌.. ఇలా ఏదైనా ఫార్మాట్లలో సేవ్‌ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్‌ చేయాలనుకుంటే ఫైల్‌ మెనూలోకి వెళ్లి సెండ్‌ ఆప్షన్‌ ద్వారా ఈమెయిల్‌కు యాడ్‌ చేయొచ్చు.  

లేయర్స్‌తోనే ఫొటోషాప్‌

ఇక లేయర్స్‌ ఫీచర్‌ను ఫొటోషాప్‌నకు ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. ఇది పలు లేయర్లలో పని చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. పక్క బార్‌లో లేయర్స్‌ బటన్‌ మీద క్లిక్‌ చేసి, క్రియేట్‌ న్యూ లేయర్‌ మీద నొక్కితే చాలు. ఈ లేయర్‌లో టెక్స్ట్‌ యాడ్‌ చేయటం వంటి పనులెన్నో చేసుకోవచ్చు. అసలు లేయర్‌ను హైడ్‌ చేయటం ద్వారా కొత్త లేయర్‌ మీద పని తేలికగా పూర్తిచేయొచ్చు. అనంతరం అసలు లేయర్‌ను కనిపించేలా చేస్తే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అవసరం లేని లేయర్లను డిలీట్‌ లేయర్‌ ఆప్షన్‌తో తొలగించుకోవచ్చు. పని పూర్తయ్యాక సేవ్‌ చేసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని