నిర్ధరణ తీరునూ వివరించే ఏఐ

వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది.

Updated : 13 Mar 2024 04:14 IST

వైద్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ విస్తరిస్తోంది. జబ్బుల నిర్ధరణ దగ్గరి నుంచి చికిత్సలను నిర్ణయించుకోవటం వరకూ ఉపయోగపడుతుంది. తాజాగా బెక్‌మ్యాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు మరో వినూత్న ఏఐ నమూనాను సృష్టించారు. ఇది జబ్బుల నిర్ధరణలో కొత్త ప్రమాణాలను నిర్ణయించగలదనీ భావిస్తున్నారు. ఎందుకంటే స్కాన్‌ పరీక్షల్లో కణితులు, జబ్బులను గుర్తించటమే కాకుండా నిర్ధరణ ప్రక్రియనూ పటంగా (ఈక్వలెన్సీ మ్యాప్‌) రూపొందించగలదు మరి. దీంతో డాక్టర్లు ఏఐ నిర్ణయాలను ధ్రువీకరించుకోవటం, తేలికగా అర్థం చేసుకోవటం సాధ్యమవుతుంది. రోగులకు ఆయా జబ్బుల గురించి అర్థమయ్యేలా వివరించటానికీ తోడ్పడుతుంది. తొలిదశలో క్యాన్సర్‌, జబ్బులను పట్టుకోవాలనేదే తమ ఉద్దేశమని దీన్ని రూపొందించిన పరిశోధకులు చెబుతున్నారు. ఆయా నిర్ణయాలకు ఏఐ ఎలా వచ్చిందో అర్థం చేసుకోవటానికీ ఉపయోగపడగలదని వివరిస్తున్నారు. వైద్యరంగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పరిజ్ఞానాలు సమాధానాలు తెలుపుతాయే తప్ప వాటికి గల కారణాలను వివరించలేవు. ఉదాహరణకు- మెదడు స్కాన్‌ దృశ్యాలను పరిశీలించి కణితుల వంటివి ఉంటే చెప్పగలవు. కానీ ఆ నిర్ణయానికి రావటానికి గల కారణాలను వివరించలేవు. దీంతో ఏఐ విశ్లేషణ నమ్మదగిందేనా? కాదా? అనేది తేల్చుకోవటం డాక్టర్లకు సవాలుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈక్వలెన్సీ మ్యాప్‌ను సృష్టించే కొత్త ఏఐ సరికొత్త ఆశలు సృష్టిస్తోంది. లక్షలాది స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే దృశ్యాలతో దీనికి శిక్షణ ఇచ్చారు. పారదర్శకతతో పనిచేయటంతో పాటు ప్రస్తుత ఏఐ డయాగ్నోస్టిక్‌ టూల్స్‌తో కచ్చితంగా సరిపోయేలా తీర్చిదిద్దారు. తొలిదశ కణితులు, మాక్యులా క్షీణత, గుండె పెద్దగా అవటం వంటి సమస్యలను గుర్తించే తీరును బట్టి దీని నైపుణ్యాన్నీ అంచనా వేశారు. అన్నింటిలోనూ రాణించి ఔరా అనిపించింది. మున్ముందు శరీరంలోని అన్ని లోపాలనూ గుర్తించి, నిర్ధరించటంతో పాటు వాటి మధ్య తేడాలనూ పోల్చుకునేలా ఈ నమూనాను తీర్చిదిద్దాలని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని