గేమింగ్‌లో కృత్రిమ నేస్తం!

ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే  ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్‌ ఏజెంట్‌ పుట్టుకొచ్చింది

Published : 20 Mar 2024 01:07 IST

ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే  ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్‌ ఏజెంట్‌ పుట్టుకొచ్చింది. గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌ సంస్థ దీన్ని పరిచయం చేసింది. పేరు సిమా (స్కేలబుల్‌ ఇన్‌స్ట్రక్టబుల్‌ మల్టీవరల్డ్‌ ఏజెంట్‌). వీడియోగేమ్స్‌లో మానవ భాషల సూచనలను పాటిస్తూ చేదోడుగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనతో కలిసి వీడియోగేమ్స్‌  ఆడుతుంది! గేమింగ్‌ రంగంలో భవిష్యత్తుగా పరిగణిస్తున్న సిమా వివరాలేంటో ఎక్కడికి, ఎలా దారితీస్తుందో తెలియదు గానీ కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొట్టటానికి తోడ్పడే ఏఐ రోబో, పూర్తిస్థాయి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆవిష్కరణ ఆశ్చర్యచకితులను చేస్తే.. తాజాగా ఏఐ గేమింగ్‌ ఏజెంట్‌ పుట్టుకొచ్చింది. గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌ సంస్థ దీన్ని పరిచయం చేసింది. పేరు సిమా (స్కేలబుల్‌ ఇన్‌స్ట్రక్టబుల్‌ మల్టీవరల్డ్‌ ఏజెంట్‌). వీడియోగేమ్స్‌లో మానవ భాషల సూచనలను పాటిస్తూ చేదోడుగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనతో కలిసి వీడియోగేమ్స్‌  ఆడుతుంది! గేమింగ్‌ రంగంలో భవిష్యత్తుగా పరిగణిస్తున్న సిమా వివరాలేంటో చూద్దాం.

ఏఐ నమూనాలు అనగానే ఛాట్‌జీపీటీ, జెమినీ వంటివే గుర్తుకొస్తాయి. సిమా వీటికి భిన్నం. ఏఐ నమూనాలకు భారీ డేటాతో శిక్షణ ఇస్తారు. ఇవి దానికి లోబడే పనిచేస్తాయి. సొంతగా పనిచేయవు. అదే ఏఐ ఏజెంట్‌ అయితే డేటాను ప్రాసెస్‌ చేసి, సొంతగా పనులు చేస్తుంది. కాబట్టే సిమా చాలా ఆసక్తి రేపుతోంది. ఇది వివిధ రకాల లక్ష్యాలను పూర్తి చేస్తుంది. వర్చువల్‌ తోడుగా నిలుస్తూ.. కాల్పనిక ప్రపంచంలో అన్ని రకాల సూచనలనూ అర్థం చేసుకుంటుంది, పాటిస్తుంది. ఉదాహరణకు- భారీ కోటల నిర్మాణానికి రహస్య నేల మాళిగలను అన్వేషిస్తుంది. అప్పగించిన సవాళ్లను చేధిస్తుంది. ఒకరకంగా దీన్ని సూపర్‌ స్మార్ట్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ అనుకోవచ్చు. డిజిటల్‌ అన్వేషకుడిలా ఆలోచిస్తుంది. కాల్పనిక ప్రపంచంలో ఏదైనా సృష్టించాలనుకుంటే దాన్ని అర్థం చేసుకొని, సహాయం చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

మన భాషను అవగతం చేసుకోవటానికి శిక్షణ ఇవ్వటం వల్ల మన ఆదేశాలను సిమా అర్థం చేసుకుంటుంది. కోటను నిర్మించు, నిధులను కనిపెట్టు.. అని చెబితే వాటిని సరిగ్గా గ్రహిస్తుంది, అర్థం చేసుకుంటుంది. మరో మంచి విషయం- దీనికి నేర్చుకునే, ఆయా సందర్భాలకు అనుగుణంగా మారే గుణం ఉండటం. యూజర్లతో పరస్పర సంభాషణల ఆధారంగా వీటిని అలవరచుకుంటుంది. ఎంత ఎక్కువగా సంభాషిస్తే అంత తెలివిని సంతరించుకుంటుంది. ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకొని, క్రమంగా మెరగవుతూ వస్తుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ వ్యవస్థలు ఒక్క గేమ్‌నే ఆడతాయి. సిమా అయితే వేర్వేరు గేమ్‌ సెటింగ్స్‌లోనూ సూచనలను తీసుకుంటుంది. ఇది గేమర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది.

శిక్షణ ఇలా..

డీప్‌మైండ్‌ సంస్థ గేమ్‌ డెవలపర్స్‌ సాయంతో సిమాకు శిక్షణ ఇచ్చింది. ఎనిమిది గేమ్‌ స్టుడియోల భాగస్వామ్యంతో తొమ్మిది వేర్వేరు వీడియో గేమ్‌ల మీద దీన్ని పరీక్షించింది. ఇది మనుషుల మాదిరిగానే వేర్వేరు గేమ్స్‌లో లక్ష్యాలను పూర్తి చేయగలనని, మాటలతో ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలనని నిరూపించింది. ఒక ఏఐ ఏజెంట్‌ ఇలాంటి సామర్థ్యాన్ని కనబరచటం ఇదే తొలిసారి. దీని ఉద్దేశం గేమ్‌ను గెలవటం కాదు. ఇచ్చిన ఆదేశాలను అర్థం చేసుకొని, వాటికి అనుగుణంగా నడుచుకుంటుంది. అంటే మనుషులతో పాటు కలిసి గేమ్‌ ఆడుతుందన్నమాట.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని