సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?

సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్‌ సాయం  తీసుకోవచ్చు.

Published : 10 Apr 2024 00:48 IST

సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్‌ సాయం  తీసుకోవచ్చు.

 వాట్సప్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టటం.. ఫాలోయర్లు లైకులు కొడితే సంతోషించటం తెలిసిందే. అయితే కొందరికిది వ్యసనంగా మారుతుంది. పోస్టులకు లైకులు, కామెంట్లు వచ్చాయోలేదోనని పదే పదే చూస్తుంటారు. లైకులు కనిపించకపోతే దిగులు పడుతుంటారు. ఇలాంటివారికి పామ్సీ ఉపయోగ పడుతుంది. ఇందులో ఎలాంటి ప్రకటనలూ ఉండవు. ఉనికిలోలేని ఫాలోయర్లతో కూడిన సామాజిక మాధ్యమ నెట్‌వర్క్‌కు పోస్ట్‌ చేసేలా చూడటమే దీని ఉద్దేశం. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికల్లో ఎలాగైతే పోస్టులను పెడతారో.. అచ్చం అలాగే ఇందులోనూ ఫొటోలతో కూడిన పోస్ట్‌ పెట్టుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్స్‌ కింద ఎన్ని లైకులను ఆశిస్తున్నారో ఆ సంఖ్యను సెట్‌ చేసుకోవాలి. అంతే సెకండ్లలోనో, గంటల్లోనో, రోజుల్లోనో నిర్ణయించుకున్న సంఖ్యలో లైకులు వస్తాయి. ఈ పోస్టులు మీతోనే ఉంటాయి. ఇతరులకు ఎవరికీ కనిపించవు. సామాజిక మాధ్యమాల పోస్టింగుల వ్యవహారం శ్రుతిమించినవారికి, వాటి నుంచి విముక్తి పొందాలను కునేవారికిది ఉపయోగపడుతుంది. జర్నలింగ్‌ యాప్స్‌తో సతమతమయ్యేవారికీ మేలు చేస్తుంది. పోస్టులన్నీ కేవలం పరికరాలకే పరిమితమవుతాయి. లైకులన్నీ నకిలీవే. అయితే లైకులన్నీ మనకు తెలిసివారికి చెందినవే కావటం విశేషం. కాంటాక్టుల జాబితాను వాడుకోవటానికి పామ్సీకి అనుమతి ఇవ్వటం వల్ల వీరి నుంచే లైకులు అందుతాయి. అయితే కాంటాక్టుల సమాచారం సర్వర్లకేమీ వెళ్లదు. అన్ని పోస్టులూ పరికరంలో మాత్రమే ఉంటాయి. చాలాకాలంగా ఫోన్‌లో పలకరించని వారి నుంచీ లైకులు రావటం విచిత్రంగా అనిపించొచ్చు గానీ అవసరం లేని కాంటాక్టులను తొలగించుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

సామాజిక మాధ్యమ వ్యసనాన్ని తగ్గించేందుకు ఐఫోన్‌, ఐప్యాడ్‌లోనూ ఇలాంటి కొన్ని యాప్‌లున్నాయి. ఉదాహరణకు- ఒపాల్‌ యాప్‌ పరికరాల వాడకాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది. గూగుల్‌ రీడర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ జాసన్‌ షెలెన్‌ కొన్నేళ్ల క్రితం బ్రిజ్లీ అనే వెబ్‌సైట్‌నూ రూపొందించారు. ఇది టెక్స్ట్‌ బాక్స్‌లో ఏదైనా రాసుకొని, సెండ్‌ చేయటానికి వీలు కల్పిస్తుంది. కానీ అది ఎవరికీ చేరుకోదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని