ఆండ్రాయిడ్‌ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్‌

డిజిటల్‌ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

Published : 17 Apr 2024 00:24 IST

డిజిటల్‌ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్‌ ఫొటోస్‌ తమ యూజర్లకు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఆధారిత ఫొటో ఎడిటింగ్‌ సదుపాయాలను పరిచయం చేయాలని భావిస్తోంది. వచ్చే నెల నుంచి అన్ని ఆండ్రాయిడ్‌ పరికరాల్లో మ్యాజిక్‌ ఎరేజర్‌, ఫొటో అన్‌బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌, మ్యాజిక్‌ ఎడిటర్‌ వంటి అధునాతన ఫీచర్లను వాడుకోవచ్చని భావిస్తున్నారు. మరి వీటి పనితీరేంటో ముందే తెలుసుకుందామా.


ఫొటో అన్‌బ్లర్‌

అస్పష్ట ఫొటోలనూ స్పష్టంగా కనిపించేలా చేయటం దీని ప్రత్యేకత. ఇది మసకగా ఉన్న ఫొటోలను మెరుగుపరుస్తుంది. అందువల్ల ఫొటో మసకగా ఉందే అనే చింత అవసరం లేదు. కృత్రిమ మేధతో పనిచేసే ఇది తేలికగా ఫొటోల నాణ్యతను మెరుగుపరుస్తుంది.


మ్యాజిక్‌ ఎరేజర్‌

కొన్నిసార్లు ఫొటోలో అవాంఛిత దృశ్యాలు, వ్యక్తులు ఉండటం ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. వీటిని తొలగించుకోవాలంటే ఫొటోషాప్‌ వంటి సాధనాలు అవసరమవుతాయి. అందరికీ వీటిని వాడటం తెలియదు. ఇలాంటివేవీ అవసరం లేకుండా ఫొటోలో అనవసర దృశ్యాలను తొలగించుకోవటాని మ్యాజిక్‌ ఎరేజర్‌ ఉపయోగపడుతుంది. దీంతో తేలికగా అవాంఛిత వస్తువులు, దృశ్యాలను తొలగించుకోవచ్చు. వాటి స్థానంలో నేపథ్య దృశ్యం వచ్చి చేరుతుంది. అది సహజంగానే కనిపిస్తుంది.


పొర్ట్రెయిట్‌ లైట్‌

మొబైల్‌ ఫోన్లతో ఫొటోలు తీసేవారికి ఇదొక అద్భుత సాధనమని చెప్పుకోవచ్చు. ఇది ఏఐ సాయంతో ఫొటోలోని వస్తువుల చుట్టూ కాంతిని మెరుగు పరుస్తుంది. ఇలా మనకు నచ్చినట్టుగా, సరిపోయినట్టుగా కాంతిని సవరించుకోవటానికి ఉపయోగ పడుతుంది. ఫొటోలను కళాఖండాలుగా తీర్చిదిద్దు కోవటానికి తోడ్పడుతుంది.


మ్యాజిక్‌ ఎడిటర్‌

తేలికగా వాడుకోవటానికి వీలైన ఇంటర్ఫేస్‌ ద్వారా అధునాతన ఎడిటింగ్‌ సామర్థ్యాలను కల్పించటం దీని ప్రత్యేకత. మ్యాజిక్‌ ఎడిటర్‌ సాయంతో నేపథ్యాన్ని ఇట్టే మార్చుకోవచ్చు. ఫొటోలోని వస్తువులు, వ్యక్తుల స్థానాలను అటూఇటూ మార్చుకోవచ్చు. మొత్తంగా ఫొటోలకు ఒక కొత్త రూపాన్ని తీసుకు రావొచ్చు. అందంగా మలచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని