100 జీబీపీఎస్‌ వేగంతో 6జీ

డేటా పంపిణీ వేగం రోజురోజుకీ పెరుగుతోంది. 4జీ, 5జీలను దాటుకొని 6జీలోకి అడుగిడుతోంది. ఈ దిశగా జపాన్‌లోని కంపెనీల సముదాయం గొప్ప ముందడుగు వేసింది

Published : 08 May 2024 00:03 IST

డేటా పంపిణీ వేగం రోజురోజుకీ పెరుగుతోంది. 4జీ, 5జీలను దాటుకొని 6జీలోకి అడుగిడుతోంది. ఈ దిశగా జపాన్‌లోని కంపెనీల సముదాయం గొప్ప ముందడుగు వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొట్టమొదటి 6జీ వైర్‌లెస్‌ పరికరాన్ని రూపొందించింది. ఇది 90 మీటర్ల దూరంలో 100 గిగాబిట్స్‌ పర్‌ సెకను (జీబీపీఎస్‌) వేగంతో డేటాను ప్రసారం చేయగలదు! 5జీ వేగంతో పోలిస్తే ఇది 20 రెట్లు ఎక్కువ కావటం విశేషం. ఈ వేగంతో ఒక సెకనులోనే 5 హెచ్‌డీ సినిమాలు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. సగటు స్మార్ట్‌ఫోన్‌లో 5జీ వేగంతో పోలిస్తే ఇది 500 రెట్లు అధికం. ఇళ్లు, కార్యాలయాల్లో 100 గిగాహెర్ట్జ్‌ (జీహెచ్‌జెడ్‌) బ్యాండ్‌ మీద 100 జీబీపీఎస్‌ వేగంతో డేటాను ప్రసారం చేయగా.. ఆరుబయట 300 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ మీద దీన్ని సాధించింది. విద్యుదయస్కాంత చట్రంలో ఇన్‌ఫ్రారెడ్‌కు దిగువన ఈ 300 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం అత్యధిక వేగంతో డేటాను ప్రసారం చేయటానికి ప్రామాణికంగా భావిస్తున్న 5జీని 2019లో అమల్లోకి తీసుకొచ్చారు. 4జీతో పోలిస్తే దీని వేగం చాలా ఎక్కువ. శాస్త్రవేత్తలు అంతటితోనే ఆగిపోలేదు. 6జీ మీదా దృష్టి సారించారు. తాజా పరికరంతో మరో ముందడుగు పడింది. ఇది మరో ఆరేడు సంవత్సరాల్లో అందుబాటులోకి రావొచ్చని ఆశిస్తున్నారు. 5జీ, 6జీల మధ్య ప్రధానమైన తేడా విద్యుదయస్కాంత చట్రంలోని ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో ముడిపడి ఉంటుంది. హయ్యర్‌ బ్యాండ్లతో డేటా ఇంకాస్త వేగంతో ప్రసారమవుతుంది. సాధారణంగా 5జీ సంకేతాలు 6 జీహెచ్‌జెడ్‌ దిగువ బ్యాండ్లలో ప్రసారమవుతాయి. వీటిని సుమారు 40 జీహెచ్‌జెడ్‌ బ్యాండ్ల వరకూ విస్తరించొచ్చు. వీటినే మిల్లీమీటర్‌-వేవ్‌ బ్యాండ్లుగా పిలుచుకుంటారు. అదే 6జీ అయితే సబ్‌-టీహెచ్‌జెడ్‌ బ్యాండ్లుగా పిలుచుకునే హయ్యర్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగించుకుంటుంది. ఇవి 100 జీహెచ్‌జెడ్‌ నుంచి 300 జీహెచ్‌జెడ్‌ శ్రేణుల మధ్యలో ఉంటాయి. అందువల్ల డేటా అతి వేగంగా ప్రసారమవుతుంది. హోలోగ్రాఫిక్‌ కమ్యూనికేషన్‌, మెరుగైన వర్చువల్‌ రియాలిటీ, మిక్స్‌డ్‌ రియాలిటీ వంటి కొత్త పరిజ్ఞానాలకిది వీలు కల్పిస్తుంది.


ఏఐ సృష్టా? కాదా?

 ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌తో ఇమేజ్‌, ఆడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఏది నిజమో, ఏది ఏఐ సృష్టో తెలుసుకోలేని పరిస్థితులూ వచ్చేశాయి. మరెలా? సందేహం తీరాలంటే https://www.aiornot.com/ అనే ఏఐ వెబ్‌ యాప్‌ సాయం తీసుకోవచ్చు. ఇది కంటెంట్‌ను గుర్తించే పరిజ్ఞానంతో ఇమేజ్‌, ఆడియోల నిగ్గు తేలుస్తుంది. దీన్ని ఖాతాను తెరచి ఉచితంగానే వాడుకోవచ్చు. గూగుల్‌ ఖాతాతో సైన్‌ ఇన్‌ అయినా సరే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని