గమ్మత్తు మ్యాప్స్‌!

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన నావిగేషన్‌ యాప్‌ల్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఒకటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ముందుగానే ఇన్‌స్టాల్‌ అయ్యుంటుంది

Published : 05 Jun 2024 00:13 IST

ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన నావిగేషన్‌ యాప్‌ల్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఒకటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ముందుగానే ఇన్‌స్టాల్‌ అయ్యుంటుంది. అయితే గోప్యతకు సంబంధించిన ఆందోళనల కారణంగానో, గూగుల్‌ మ్యాప్స్‌లో లేని ఫీచర్లను వాడుకోవటానికో ఇతర యాప్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి ప్రత్యామ్నాయ నావిగేషన్‌ యాప్‌ల్లో కొన్ని ఇవిగో..

వేజ్‌

ఇది సముదాయ సంచార యాప్‌. దీన్ని కార్లు, బైక్‌లు నడిపేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దారులను చూపటంతో పాటు పోలీస్‌ అలర్టులు, విపత్తుల హెచ్చరికలు, ట్రాఫిక్‌ రద్దీ వంటి అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అందించటం దీని ప్రత్యేకత. గూగుల్‌ మ్యాప్స్‌ మాదిరిగా కాకుండా ప్రత్యక్ష ట్రాఫిక్‌ సమాచారం ఆధారంగా తనకు తానే దారులను మార్చి చూపిస్తుంది. దగ్గరి దారులను సూచిస్తుంది. మామూలు ఇంటర్ఫేస్‌తో కూడిన నావిగేషన్‌ యాప్‌ కోసం చూసేవారు వేజ్‌ను ప్రయత్నించొచ్చు.

సీజిక్‌

ఇది బోలెడన్ని ఫీచర్లతో కూడిన నావిగేషన్‌ యాప్‌. ప్రత్యక్ష ట్రాఫిక్‌ అప్‌డేట్లను అందిస్తుంది. గమ్యాన్ని త్వరగా చేరుకోవటానికి దగ్గరి దారులను సూచిస్తుంది. డైనమిక్‌ లేన్‌ గైడెన్స్‌ వంటి ఫీచర్లూ సీజిక్‌లో ఉన్నాయి. ప్రమాదాలు, రోడ్లను మూసేయటం వంటి వాటికి సంబంధించిన సమాచారాన్నీ అందిస్తుంది. అయితే ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌ కోసం గూగుల్‌ మ్యాప్స్‌లో మాదిరిగా కాకుండా ఆయా ప్రాంతాల మ్యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సీజిక్‌ అన్ని దేశాల 3డీ మ్యాప్‌లను కలిగుంటుంది. రియల్‌ వ్యూ నావిగేషన్‌ మరో మంచి ఫీచర్‌. ఇదో ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) టూల్‌. పరికరంలో నావిగేషన్‌ సూచనల కోసం చూస్తున్నప్పుడు రోడ్డు కనిపించేలా చేయటం దీని ప్రత్యేకత.

మ్యాప్‌ల్స్‌ మ్యాప్‌మై ఇండియా

మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన నావిగేషన్‌ యాప్‌ల్లో ఇదొకటి. గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న వాయిస్‌-గైడెడ్‌ నావిగేషన్, తాజా ట్రాఫిక్‌ అప్‌డేట్ల వంటి ఫీచర్లను అందించటమే కాకుండా ఇది స్పీడ్‌ బ్రేకర్లు, నీరు నిలిచిపోవటం, మ్యాన్‌హోల్స్, చివరికి పనిచేయని వీధి దీపాల సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. సంక్లిష్టమైన చిరునామాలను గుర్తించటానికిది ఆరు క్యారెక్టర్లతో కూడిన మ్యాప్‌ల్స్‌ ఐడీని షేర్‌ చేసుకునే సదుపాయాన్నీ కల్పిస్తుంది. కిక్కిరిసిన ప్రాంతాల్లో ఇదెంతగానో ఉపయోగపడుతుంది. జంక్షన్‌ వ్యూ ఫీచరైతే మున్ముందు వచ్చే ఫ్లైఓవర్లు, కూడళ్లనూ రియలిస్టిక్‌ వ్యూలో చూపిస్తుంది.

ఓస్మాండ్‌

ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు తిరిగి వస్తున్నారు? అనే విషయాలపై నిఘా పెట్టని నావిగేషన్‌ యాప్‌ కోసం చూసేవారికిది మంచి ఎంపిక. ఇదో ఆఫ్‌లైన్‌ ప్రపంచ పటం మ్యాప్‌. దీని ఇంటర్ఫేస్‌ మామూలుగా ఉంటుంది. మొదట్లో కాస్త తికమకగా అనిపించొచ్చు. ఇందులో మాటతో దారిని తెలియజేసే అసిస్టెంట్‌ ఫీచర్‌ కూడా ఉంది. మ్యాప్‌లో బోలడన్ని వివరాలను చూపిస్తుంది. అయితే కొన్ని ఫీచర్లు కోసం చందా తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం సిద్ధపడిన వారు గోప్యతను కాపాడుకోవటానికి ఓస్మాండ్‌ నావిగేషన్‌ యాప్‌ను ప్రయత్నించొచ్చు.

హియర్‌వీగో

ఆండ్రాయిడ్, ఐఫోన్‌ పరికరాలు రెండింటిలోనూ అందుబాటులో ఉండే మరో యాప్‌ హియర్‌వీగో. గూగుల్‌ మ్యాప్స్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లూ ఇందులో ఉంటాయి. ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌ కోసం దేశం మొత్తం పటాలను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం అదనపు ప్రయోజనం. హియర్‌వీగో ఇంటర్ఫేస్‌ను వాడుకోవటం తేలిక. ప్రకటనల ప్రస్తావనే ఉండదు. సవివరమైన మ్యాప్‌లు, ప్రత్యక్ష ట్రాఫిక్‌ అప్‌డేట్ల కోసం గూగుల్‌ మ్యాప్స్‌కు బదులు మరో యాప్‌ వాడుకోవాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని