నిమిషంలోనే ఫోన్‌ ఛార్జ్‌!

ఒక్క నిమిషంలో ఫోన్‌ ఛార్జ్‌ అయితే? ఎలక్ట్రిక్‌ కారు కేవలం 10 నిమిషాల్లోనే ఛార్జ్‌ అయితే? ఇప్పటికైతే ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌లో పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త అంకుర్‌ గుప్త, బృందం పుణ్యమాని త్వరలోనే సాకారం కానుంది

Published : 05 Jun 2024 00:11 IST

ఒక్క నిమిషంలో ఫోన్‌ ఛార్జ్‌ అయితే? ఎలక్ట్రిక్‌ కారు కేవలం 10 నిమిషాల్లోనే ఛార్జ్‌ అయితే? ఇప్పటికైతే ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌లో పనిచేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త అంకుర్‌ గుప్త, బృందం పుణ్యమాని త్వరలోనే సాకారం కానుంది. వీరు సంక్లిష్ట అతి సూక్ష్మ రంధ్రాల సముదాయంలో అయాన్లనే ఆవేశిత కణాలు ఎలా కదులుతాయో గుర్తించారు. ఇప్పటివరకూ అయాన్లు ఒక రంధ్రం గుండానే నేరుగా కదులుతాయని భావిస్తున్నారు. అయితే ఇవి అంతర్గతంగా అనుసంధానమైన లక్షలాది రంధ్రాల సంక్లిష్ట సముదాయం గుండా కదులుతాయని అంకుర్‌ గుప్త బృందం గుర్తించింది. వీటిని కొద్ది నిమిషాల్లోనే ప్రేరేపితం చేయొచ్చు. వాటి కదలికలను అంచనా వేయొచ్చు. ఈ పరిజ్ఞానం మరింత సమర్థమైన సూపర్‌ కెపాసిటర్లకు మార్గం సుగమం చేయనుంది. సూపర్‌కెపాసిటర్లు విద్యుత్తును నిల్వ చేసుకునే పరికరాలు. ఇవి వాటిల్లోని సూక్ష్మ రంధ్రాల్లో అయాన్లు పోగుపడటం మీద ఆధారపడి పనిచేస్తాయి. మామూలు బ్యాటరీలతో పోలిస్తే పరికరాలను త్వరగా ఛార్జ్‌ చేస్తాయి. అలాగే ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. వీటి సామర్థ్యం పెరిగితే అత్యంత వేగంగా పరికరాలను ఛార్జ్‌ చేయగలవు. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో విద్యుత్తును నిల్వ చేయటానికే కాకుండా విద్యుత్తు గ్రిడ్‌లకూ తాజా ఆవిష్కరణ ఉపయోగపడగలదు. తక్కువ డిమాండ్‌ ఉన్నప్పుడు విద్యుత్తును సమర్థంగా నిల్వ చేసుకొని, ఎక్కువ డిమాండ్‌ ఉన్నప్పుడు నిరాటంకంగా సరఫరా చేయటానికి తోడ్పడుతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు