Google: ‘కొత్త ఏడాదిలో మీ మొదటి శోధన ఏంటి?’ గూగుల్ ప్రశ్నకు నెటిజన్ల స్పందనలు ఇవే!

కొత్త ఏడాదిలో దేని గురించి మొదట వెతుకుతారని గూగుల్‌ అడిడిన ప్రశ్నకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మరి, యూజర్ల సమాధానాలు ఎలా ఉన్నాయో మీరూ చూసేయండి. 

Published : 31 Dec 2022 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత సంవత్సరం ముగిసి మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. సాధారణంగా కొత్త ఏడాది అనగానే ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుని కొత్తగా ఏదైనా చేయాలని ప్రణాళికలు వేసుకుంటాం. అలా, అవతలి వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ మందిలో కలగడం సర్వసాధారణం. దాంతో కొత్త ఏడాదిలో నీ ప్రణాళిక ఏంటి? అని స్నేహితులు, బంధువుల, పరిచయం ఉన్న వారిని అడిగేస్తాం. సరిగ్గా.. ఇదే ఆలోచనతో గూగుల్  (Google) యూజర్లను ప్రశ్నించింది. ‘‘2023లో గూగుల్‌లో మీరు మొదట దేని గురించి సెర్చ్‌ చేయబోతున్నారు?’’ అని ట్వీట్ చేసింది. అడగడమే ఆలస్యం అన్నట్లుగా యూజర్లు తమ సమాధానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి, యూజర్లు ఎక్కువగా దేని గురించి వెతకాలనుకుంటున్నారు? గూగుల్ ప్రశ్నకు వారి సమాధానాలు ఎలా ఉన్నాయో తెలుసా..?

చాట్‌జీపీటీ

గూగుల్ ప్రశ్నకు ఎక్కువ మంది యూజర్లు చాట్‌జీపీటీ (ChatGPT) గురించి వెతకాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. ఇది ఒక చాట్‌బోట్‌. ఏఐ సాయంతో పనిచేస్తుంది. యూజర్‌కు కావాల్సిన సమాచారాన్ని గూగుల్ కంటే మెరుగ్గా ఇస్తోందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎక్కువ మంది యూజర్లు  ఈ ఓపెన్‌ఏఐ టూల్‌ను ఉపయోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. 

కరోనా అంతం ఎప్పుడు?

చాట్‌జీపీటీ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఆ దేశంలో కరోనా పరిస్థితులపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కొవిడ్ ఎప్పుడు అంతం అవుతుంది? అని వెతుకుతామని ఎక్కువ మంది ట్వీట్ చేశారు. 

గూగుల్‌లో ఉద్యోగం

ఆర్థికమాంద్యం ఆందోళన నేపథ్యంలో టెక్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి. ఆ జాబితాలో గూగుల్ కూడా ఉంది. అయినప్పటికీ, ‘గూగుల్ లో ఉద్యోగం ఎలా సంపాదించాలి?’, ‘గూగుల్ క్లౌడ్‌ ఇంజనీర్‌గా ఎలా మారాలి?’ అనే అంశాల గురించి వెతుకుతామని పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. 

వీటి తర్వాత ట్విటర్‌ కొత్త సీఈవో నియామకం, పిక్సెల్‌ ట్యాబ్లెట్‌ విడుదల తేదీ, హువావే-గూగుల్ కంపెనీలు తిరిగి కలిసి పనిచేస్తాయా?, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ విడుదల వంటి అంశాల గురించి సెర్చ్‌ చేస్తామని నెటిజన్లు బదులిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని