Google: ఇక షాపింగ్ సులువుగా.. మ్యాప్స్‌లో విజువల్‌ వండర్‌!

యూజర్లకు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సరికొత్త అనుభూతిని అందించడం కోసం గూగుల్ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేసింది. వీటితోపాటు మ్యాప్స్‌లో మరో మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది...

Published : 02 Oct 2022 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్‌ బ్రౌజింగ్‌కు గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌ ఓ ప్రత్యామ్నాయంలా మారిపోయింది. ఇతర కంపెనీల సెర్చ్‌ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ రిజల్ట్‌తో యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తుండటంతో ఎక్కువ మంది గూగుల్‌నే ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్, గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మరి, ఆ ఫీచర్లేంటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయో చూద్దామా..!

షాపింగ్ ఆన్‌ గూగుల్ 

గూగుల్‌లో ఏదైనా ప్రొడక్ట్ కోసం వెతికితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. ఉదాహణకు మొబైల్ గురించి సెర్చ్‌ చేస్తే దాని ధర, ఫొటో, ఎక్కడ లభిస్తుందనే వివరాలను చూపిస్తుంది. తాజా అప్‌డేట్‌లో సెర్చ్‌ బార్‌లో షాపింగ్‌ (Shopping) అని టైప్‌ చేసి, తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ పేరును టైప్‌ చేయాలి. రిజల్ట్‌లో ప్రొడక్ట్‌కు సంబంధించిన ఫొటో/వీడియోలతోపాటు, దగ్గరల్లో ఎక్కడ లభిస్తుంది? ధరల వ్యత్యాసం ఎలా ఉందనే వివరాలను కనిపిస్తాయి. 

దీంతోపాటు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్ట్‌కు అనువైన యాక్ససెరీలు, అదే కేటగిరిలో ట్రెండింగ్‌లో ఉన్న ఇతర మోడల్స్‌కు సంబంధించిన సమాచారం కూడా సెర్చ్‌ రిజల్ట్‌లో చూపిస్తుంది. యూజర్‌కు ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ అనుభూతి కోసం 3డీ వ్యూ (3D View), 360 డిగ్రీల కోణంలో ప్రొడక్ట్‌ను పరిశీలించవచ్చు. సెర్చ్‌ రిజల్ట్‌లో చూపించిన వివరాల్లో నమ్మకమైన రిటైలర్‌ ఎవరనేది తెలుసుకొనేందుకు బైయింగ్‌ గైడ్‌ (Buying Guide) అనే ఫీచర్‌ యూజర్‌కు సాయపడుతుంది.

రిసెర్చింగ్ (Researching) ఫీచర్‌ సాయంతో ప్రొడక్ట్‌ గురించి యూజర్లు పంచుకున్న అభిప్రాయాలు, రివ్యూలు, రేటింగ్‌ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. పర్సనలైజ్డ్‌ రిజల్ట్‌ (Personalised Result), సెర్చ్‌ ఫిల్టర్ (Search Filter)‌, డిస్కవర్‌ (Discover) ఫీచర్లు యూజర్‌కు కావాల్సిన ప్రొడక్ట్‌ను సులువుగా, వేగంగా ఎంచుకొని, కొనుగోలు చేసేందుకు సాయపడతాయని గూగుల్ తెలిపింది. 

మ్యాప్స్‌లో మరో మూడు ఫీచర్లు

కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అడ్రస్‌ కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తాం. తాజాగా మ్యాప్స్‌లో వైబ్‌ చెక్‌ (Vibe Check), విజువల్ ఫార్వార్డ్‌ (Visul Forward),  ఇమ్మెర్సివ్‌ వ్యూ (Immersive View) పేర్లతో మూడు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను గూగుల్ పరిచయం చేస్తోంది. గూగుల్‌ సెర్చ్‌లో అరౌండ్‌ మీ (Around Me) ఫీచర్‌ తరహాలో వైబ్‌ చెక్ పనిచేస్తుంది. ఇది మ్యాప్స్‌లో యూజర్‌ ఉన్న ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలు, పాపులర్‌ రెస్టారెంట్‌లకు సంబంధించిన ఫొటోలు, రివ్యూలను చూపిస్తుంది. దీంతో యూజర్‌ ఎక్కడికి వెళ్లాలనేది సులువుగా నిర్ణయించుకోవచ్చు.

విజువల్ ఫార్వార్డ్ ఫీచర్‌ సాయంతో యూజర్‌ టూరిస్ట్ ప్రదేశాలకు సంబంధించిన ట్రావెల్‌ వెబ్‌సైట్ల వివరాలతోపాటు, గైడింగ్ సమాచారం పొందవచ్చు. ఇమ్మెర్సివ్‌ వ్యూ (Immersive View)తో యూజర్లు వెతికే ప్రదేశంలోని వాతావరణం, ట్రాఫిక్‌, కట్టడాలను సంబంధించిన వివరాలను 3డీ వ్యూలో చూడొచ్చు.

Note: ప్రస్తుతం ఈ ఫీచర్లు అమెరికన్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే భారత్‌ సహా అన్ని రీజియన్లలో పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్లు యాప్‌ యూజర్లకు మాత్రమే, భవిష్యత్తులో డెస్క్‌టాప్ యూజర్లకు పరిచయం చేస్తామని గూగుల్ తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని