Google: ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ను చదివేయొచ్చు!

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు సైతం పరిచయం చేయనుంది.

Published : 20 Dec 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒంట్లో నలతగా ఉందని డాక్టర్‌ దగ్గరకు వెళితే.. రోగిని పరిశీలించి ఏవో కొన్ని మందులు రాసిస్తారు. అయితే, ఆయన రాసిన మందుల వివరాలు చదువుదామంటే ఓ పట్టాన అర్థంకావు. కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అందులోని మందుల పేర్లు తెలుస్తాయి. దీంతో డాక్టర్‌ ఏం మందులు రాశాడో తెలియదు. మందులషాపువాడు పొరపాటున మార్చి ఇచ్చినా.. వాటినే వాడేస్తుంటాం. ఒకవేళ డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌లో ఏం రాశారో చదవగలిగితే? ఇంకేం సులువుగా మందుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఆలోచనతోనే గూగుల్ (Google) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దిల్లీలో జరుగుతున్న గూగుల్ ఫర్‌ ఇండియా 2022 (Google for India 2022)లో ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 

డాక్టర్‌ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను యూజర్‌ గూగుల్ లెన్స్‌తో ఫొటో తీస్తే, అందులోని మందుల వివరాలను సెర్చ్‌లో చూపిస్తుంది. అయితే, సెర్చ్‌ రిజల్ట్‌లో చూపించిన మందుల వివరాలను ఆధారంగా యూజర్లు ఇప్పుడే ఒక నిర్ధరణకు రావొద్దని గూగుల్ సూచిస్తుంది. ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు మెడికల్‌ రికార్డ్‌లను డిజిటలైజ్‌ చేయడంతోపాటు ఫార్మాసిస్ట్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇది ఏఐ ఆధారిత మెషీన్‌ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేస్తుంది.

‘‘గూగుల్ లెన్స్‌ను భారతీయులు వేర్వేరు అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ చదివే ఫీచర్‌ను యూజర్లు పరిచయం చేయడం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ బృందం భావించింది. అందుకే ఈ ఫీచర్‌ను యూజర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. దీంతోపాటు గూగుల్ పే భద్రతను మరింత మెరుగుపరిచినట్లు తెలిపింది. ఇందులోని మల్టీ-లేయర్డ్‌ ఇంటెలిజెంట్ అలెర్ట్ సిస్టమ్‌ యూజర్‌కు మోసపూరిత లావాదేవీలకు పాల్పడే వ్యవస్థల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇందుకోసం నేషన్‌ ఈ-గవర్నమెంట్ డివిజన్‌ (NeGD)తో కలిసి పనిచేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని