Google Updates: క్రోమ్‌లో బగ్ ఫిక్స్‌.. మడత ఫోన్ల కోసం డ్రాగ్‌ అండ్‌ డ్రాప్!

గూగుల్ వర్క్‌స్పేస్‌లోని యాప్‌లను అప్‌డేట్‌ చేసింది. ఇందులో భాగంగా జీమెయిల్‌, మీట్‌, షీట్స్‌లో కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

Updated : 30 Nov 2022 11:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్క్‌స్పేస్‌లోని యాప్స్‌ను గూగుల్ అప్‌డేట్‌ చేసింది. జీమెయిల్‌ సహా ఇతర యాప్‌లలో కొత్తగా మార్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని రీజియన్లలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. మరో రెండు వారాల్లో పూర్తిస్థాయిలో వర్క్‌స్పేస్‌ సబ్‌స్క్రైబర్లకు పరిచయం కానున్నట్లు తెలిపింది. 


జీమెయిల్‌ (Gmail)

జీమెయిల్‌లో సెర్చ్‌ ఫీచర్‌ను గతంలోకంటే మరింత మెరుగుపరిచినట్లు గూగుల్ వెల్లడించింది. ఇకపై యూజర్‌ జీమెయిల్‌ సెర్చ్‌లో దేని గురించి వెతికినా కచ్చితత్వంతో ఫలితాలను చూపిస్తుందని గూగుల్ చెబుతోంది. అంతేకాకుండా యూజర్‌ అంతకముందు వెతికిన వాటికి సంబంధించిన సమాచారం కూడా చూపిస్తుందని తెలిపింది. 


గూగుల్ షీట్స్‌ ( Google Sheets)

గూగుల్ షీట్స్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు పివోట్ టేబుల్స్‌ను అప్‌డేట్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. పివోట్ టేబుల్స్‌ను క్రియేట్‌ చేసి, ఎడిట్ చేసేటప్పుడు వాటి సైజును యూజర్‌ తనకు అనువుగా మార్చుకోవచ్చని తెలిపింది. చాలా కాలంగా యూజర్లు ఈ ఫీచర్‌ కోసం డిమాండ్ చేస్తున్నారట. అలానే, టేబుల్‌లోని ఏదైనా కాలమ్‌ పేరు పెద్దదిగా ఉంటే.. దానిని చదివేందుకు లేదా అందులో మార్పులు చేసేందుకు యూజర్లు పివోట్ టేబుల్ ఎడిటర్‌ను ఉపయోగించవచ్చు.  


గూగుల్ మీట్ (Google Meet)

గతంలో గూగుల్ డాక్స్‌, స్లైడ్స్‌, షీట్స్‌ నుంచి మీట్ కాల్‌లో పాల్గొనేలా ఆయా యాప్‌లను అప్‌డేట్ చేసింది. తాజాగా అప్‌డేట్‌లో యూజర్లు డాక్స్‌, స్లైడ్స్‌, షీట్స్‌ నుంచి మీట్‌ చాట్‌ లేదా కాల్‌లో పాల్గొంటూ ఫైల్స్‌ను షేర్ చేయొచ్చు. దీంతో మీట్‌లో పాల్గొనేవారందరకి ఒకేసారి ఫైల్ షేర్‌ అవుతుంది. అంతేకాకుండా ఫైల్‌లోని సబ్జెక్ట్‌ గురించి అందరూ ఒకేసారి చర్చించుకోవడంతోపాటు, ప్రజెంటేషన్‌ను ఇవ్వొచ్చని గూగుల్ తెలిపింది. 


క్రోమ్‌ అప్‌డేట్ (Google Chrome)

గతవారం క్రోమ్‌ బ్రౌజర్‌లో గుర్తించిన జీరో-డే సమస్యను సరిచేస్తూ గూగుల్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. CVE-2022-413 పేరుతో ఈ బగ్‌ను గూగుల్ థ్రెట్‌ అనాలసిస్‌ గ్రూప్‌ గుర్తించింది. తాజాగా ఈ సమస్యను పరిష్కరిస్తూ గూగుల్ క్రోమ్‌ 107.0.5304.121 (మ్యాక్‌/లైనెక్స్‌ డివైజ్‌లకు), 107.0.5304.121/.122 (విండోస్‌ కంప్యూటర్ల) కోసం విడుదల చేసింది. యూజర్లు తమ కంప్యూటర్లలో క్రోమ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి అబౌట్‌ క్రోమ్‌ ఆప్షన్‌ ద్వారా అప్‌డేట్ చేయొచ్చు.  


డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ (Drag and Drop)

మడతఫోన్లు, ట్యాబ్లెట్స్‌ వంటి పెద్ద డిస్‌ప్లే ఉన్న డివైజ్‌ల కోసం గూగుల్ డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు స్ల్పిట్‌ స్క్రీన్‌ ఫీచర్‌ ద్వారా ఫైల్స్‌ను ఒక యాప్‌ నుంచి మరో యాప్‌లోకి (గూగుల్ యాప్స్‌ మాత్రమే) బదిలీ చేయొచ్చు. స్ల్పిట్‌ స్క్రీన్‌లో రెండు యాప్‌లు పక్కపక్కనే చూడొచ్చు. దీంతో యూజర్‌ సులువుగా ఒక యాప్‌ నుంచి మరో యాప్‌లోకి ఫైల్స్‌ను డ్రాగ్‌ చేయొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని