Indus Royal Game: వీర్‌లోక్‌లో మిథ్‌వాకర్స్‌ పోరాటం.. దేనికోసం?

పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా మేడిన్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో పుణెకు చెందిన సూపర్‌ గేమింగ్‌ అనే సంస్థ ఇండస్‌ రాయల్‌ గేమ్‌ అనే సరికొత్త వీడియో గేమ్‌ను డిజైన్‌ చేసింది. 

Published : 28 Jan 2023 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్‌జీ (PUBG)పై నిషేధం తర్వాత ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారికి దేశీయంగా డిజైన్‌ చేసిన ఇండస్‌ రాయల్‌ గేమ్‌ (Indus Royal Game) అందుబాటులోకి రానుంది. పుణెకు చెందిన సూపర్‌ గేమింగ్‌ (Super Gaming) అనే సంస్థ ఇండస్‌ను డిజైన్‌ చేసింది. ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కంపెనీ విడుదల చేసింది. మేడిన్‌ ఇన్‌ ఇండియా(Made In India) స్ఫూర్తితో పూర్తి దేశీయంగా రూపుదిద్దుకున్న ఈ గేమ్‌ ముందస్తు రిజిస్ట్రేషన్లు గూగూల్ ప్లేస్టోర్‌ (Google PlayStore)లో ప్రారంభమయ్యాయి. పబ్‌జీ భారతీయ వెర్షన్‌ బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్ ఇండియా(BGMI), అపెక్స్ లెజెండ్స్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి గేమ్‌లకు ఇండస్‌ ప్రత్యామ్నాయం కానుందని కంపెనీ చెబుతోంది. 

ఈ గేమ్‌లో ఆటగాళ్లను మిథ్‌వాకర్స్ అని పిలుస్తారు. మిథ్‌వాకర్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా కొవిన్‌ అనే వ్యవస్థ వారిని నియమించుకుంటుంది. వీరంతా యక్షులు నివసించే ఇండస్‌ అనే తేలియాడే గ్రహంలో ఉన్న కాస్మియమ్‌ను కనుగొనాలి.  గేమ్‌లో ఆడమ్‌, ఆద్య, వొయిడ్‌, బిగ్‌గాజ్‌, సిర్‌ తాజ్‌ అనే క్యారెక్టర్లు ఉంటాయి. వీరిని న్యూరాన్‌ లింక్‌తో నియంత్రిస్తారు. స్పేస్‌షిప్‌ నుంచి వీరిని  కాస్మియమ్‌ కోసం ఇండస్‌లోని వీర్‌లోక్‌ అనే ఐల్యాండ్‌లోకి జారవిడుస్తారు.

వీర్‌లోక్‌లోకి వెళ్లిన తర్వాత ప్లేయర్స్ తమకు కావాల్సిన ఆయుధాలు, ఇతర పోరాట సామాగ్రిని నిర్ణీత సమయంలోపు వెతికి చేజిక్కించుకోవాలి. తర్వాత అక్కడి శత్రువుల నుంచి తమని కాపాడుకుంటూ కాస్మియమ్‌ అనే లోహాన్ని తీసుకుని తిరిగి స్పేస్‌షిప్‌లోకి చేరుకోవాలి. ఈ గేమ్‌ పూర్తిగా భారతీయ నేపథ్యంతో డిజైన్‌ చేసినట్లు సూపర్‌ గేమింగ్ కంపెనీ చెబుతోంది. గ్రాఫిక్స్‌ పరంగా ఎంతో గ్రాండ్‌గా గేమ్‌ను డిజైన్ చేసినట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. త్వరలోనే ఈ గేమ్‌ సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని సూపర్‌ గేమింగ్‌ సంస్థ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని