Photo Editing: ఫొటో సవరణకు కొత్త ఏఐ!

ఫొటో ఎడిటింగ్‌కు ఫొటోషాప్‌ పెట్టింది పేరు. అయితే దీన్ని వాడుకోవటానికి నైపుణ్యం అవసరం. కానీ ఎలాంటి నైపుణ్యం లేకపోయినా, టెక్నిక్‌లు తెలియకపోయినా ఫొటోషాప్‌ మాదిరిగా.. ఆ మాటకొస్తే అంతకన్నా మిన్నగా ఇమేజ్‌లను సరిదిద్దుకోగలిగితే? .

Published : 24 May 2023 00:03 IST

ఫొటో ఎడిటింగ్‌కు ఫొటోషాప్‌ పెట్టింది పేరు. అయితే దీన్ని వాడుకోవటానికి నైపుణ్యం అవసరం. కానీ ఎలాంటి నైపుణ్యం లేకపోయినా, టెక్నిక్‌లు తెలియకపోయినా ఫొటోషాప్‌ మాదిరిగా.. ఆ మాటకొస్తే అంతకన్నా మిన్నగా ఇమేజ్‌లను సరిదిద్దుకోగలిగితే? రంగు, బ్యాక్‌గ్రౌండ్‌ వంటి వాటినే కాదు, మొత్తంగా రూపాన్ని, పిక్సెల్స్‌నే మార్చేస్తే? అదీ ఆకారంలో ఎలాంటి మార్పులేకుండా, ఒరిజినల్‌ ఫొటో మాదిరిగా కనిపిస్తే? జెనరేటివ్‌ ఏఐ పరిజ్ఞానంతో కూడిన కొత్త టూల్‌ డ్రాగ్‌గాన్‌ అలాంటి విచిత్రమే చేస్తుంది.

జెనరేటివ్‌ ఏఐ పరిజ్ఞానంలో రోజురోజుకీ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. వీటితో కూడిన టూల్స్‌ చిత్ర విచిత్రాలు సృష్టిస్తున్నాయి. దీనికి తాజా నిదర్శనం డ్రాగ్‌గాన్‌. గూగుల్‌, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, ఎంఐటీ సీఎస్‌ఏఐఎల్‌కు చెందిన పరిశోధకులు ఇటీవలే దీనిపై ఒక పరిశోదన పత్రాన్ని వెలువ రించారు. దీన్ని వాడుకోవటానికి ఎలాంటి టెక్నిక్‌లు అవసరం లేదు. తేలికైన పాయింట్‌ అండ్‌ డ్రాగ్‌ కంట్రోళ్లతో ఇష్టం వచ్చినట్టుగా ఫొటోలను మార్చుకోవచ్చు. ఇమేజ్‌ మీద ఒక చుక్కలను అమర్చి, డ్రాగ్‌ చేస్తే చాలు. అవసరమైన విధంగా మార్చుకునేలా చేయటం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- సింహం నోరు మూసుకొని ఉంటే తెరచుకునేలా చేయొచ్చు. కారు ఫొటోను వేరే కోణంలోంచి తీసినట్టుగా మార్చేయొచ్చు. పర్వతాన్ని రెండింతలు ఎత్తుకు పెంచేయొచ్చు. ఇలాంటి మార్పులు చేస్తే ఫొటో స్వరూపమే మారిపోతుందని, పనికిరాదని  అనుకుంటున్నారేమో. అలాంటి భయమేమీ అక్కర్లేదు. ఎన్నిరకాలుగా మార్చినా అచ్చం ఫొటో మాదిరిగానే కనిపిస్తుంది. అంతా జెనరేటివ్‌ ఏఐ మహాత్మ్యం. చాలా తేలికగా వాడుకునేలా వీలుండటం మరో విశేషం. కొద్ది సెకండ్లలోనే ఎవరైనా దీన్ని వాడుకోవటాన్ని నేర్చుకోవచ్చు. మార్పు చేయాలనుకునే చోట ముందు, చివరలో పాయింట్లను సెట్‌ చేసుకుంటే చాలు. ఉదాహరణకు- నోరు మూసుకొని ఉన్నవారి ఫొటోను నవ్వేలా చేయాలనుకోండి. నోటి మూలలకు రెండు పాయింట్లను, వాటికి కాస్త దూరంలో మరో రెండు పాయింట్లను జత చేసి, స్టార్ట్‌ బటన్‌ను నొక్కితే సరి. టూల్‌ పని మొదలెడుతుంది. యానిమేషన్‌ రూపంలో నోటిని సెట్‌ చేసుకున్న పాయింట్ల వరకు తెరచుకునేలా చేస్తుంది. ఈ క్రమంలో ఏవైనా లోపాలు తలెత్తితే ఇమేజ్‌ డేటాను ఊహించుకొని, పిక్సెల్స్‌ను సృష్టించుకొని తనకు తానే సరిచేసేస్తుంది. అంటే ముఖ కవళికలు, రూపం మారినా తేడాలు లేకుండా సరిదిద్దుతుందన్నమాట. ఫొటోలో మిగతా భాగం మారకుండా ఏవో కొన్ని భాగాలనే ప్రస్ఫుటంగా కనిపించేలా కూడా చేయగలదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు