Whatsapp: వాట్సప్‌ ప్రపంచంలో జాగ్రత్త!

ఇటీవల స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వాట్సప్‌లో పెద్ద సమస్యగా మారాయి. ఎంతోమంది మోసాల బారిన పడుతున్నారు. డబ్బులూ పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇలాగే మోసగాళ్ల వలలో చిక్కి, రూ.42 లక్షలు పోగొట్టు కోవటం సంచలనం సృష్టించింది.

Updated : 24 May 2023 12:49 IST

ఇటీవల స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు వాట్సప్‌లో పెద్ద సమస్యగా మారాయి. ఎంతోమంది మోసాల బారిన పడుతున్నారు. డబ్బులూ పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య గురుగ్రామ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇలాగే మోసగాళ్ల వలలో చిక్కి, రూ.42 లక్షలు పోగొట్టు కోవటం సంచలనం సృష్టించింది. సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ ద్వారా అతడిని సంప్రదించి, పార్ట్‌-టైమ్‌ ఉద్యోగం ఇస్తామని ఆశ పెట్టారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో చేరాలని సూచించారు. టెక్నాలజీ గురించి బాగా తెలిసి ఉన్నప్పటికీ ఆ ఇంజినీరు నేరగాళ్ల మాయలో పడి డబ్బులు కోల్పోవటం గమనార్హం. ఇలాంటి సమస్యలను పరిష్కరించ టానికి వాట్సప్‌ ప్రయత్నిస్తోంది. అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది.

రెండంచెల (టూ స్టెప్‌) ధ్రువీకరణను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇది వాట్సప్‌ ఖాతా సురక్షితంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఖాతా రీసెటింగ్‌, వెరిఫై చేస్తున్నప్పుడు ఆరు అంకెల పిన్‌ నంబరును అడుగుతుంది. ఇతరులు మన ఖాతాలోకి చొరబడకుండా కాపాడుతుంది.

తెలియనివారి నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనుచిత సమాచారాన్ని కోరినా, విచిత్రమైన అభ్యర్థనలు చేసినా అనుమానించాలి. ఇలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దు. నేరుగా ఆ వ్యక్తులకు లేదా సంస్థలకు ఫోన్‌ చేసి ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ వారికి ఇవ్వద్దు. డబ్బులు పంపొద్దు.

అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌కు జవాబు ఇవ్వద్దు. ఇలాంటి కాల్స్‌ను వెంటనే బ్లాక్‌ చేయాలి. అనుమానిత ఖాతాల గురించి రిపోర్టు చేయాలి.

అనుమానిత గ్రూప్‌ ఛాట్‌లో ఉన్నట్టు అనిపిస్తే వెంటనే దానిలోంచి బయటకు వచ్చేయాలి. దాని మీద ఫిర్యాదు (రిపోర్టు) చేయాలి.

ప్రొఫైల్‌ ఫొటో, ఆన్‌లైన్‌ స్టేటస్‌ వంటి వివరాలను ఎవరెవరు చూడొచ్చనేది మనమే నిర్ణయించుకోవచ్చు. సెటింగ్స్‌లోని ప్రైవసీ విభాగం ద్వారా దీన్ని ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ స్టేటస్‌ను చూసేవారిని పరిమితం చేసుకుంటే భద్రతా పెరుగుతుంది. నమ్మకమైన కాంటాక్టులతోనే వ్యక్తిగత వివరాలను పంచుకోవాలి.

వాట్సప్‌ ఖాతాకు అనుసంధానమైన పరికరాలను తరచూ సమీక్షించుకోవటం మంచిది. ఏదైనా తెలియని పరికరం కనిపిస్తే వెంటనే దాన్నుంచి లాగ్‌ అవుట్‌ కావాలి.

అనుమానిత టెక్స్ట్‌, అభ్యర్థనలు అందినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అవి నిజమో, కాదో తెలుసుకోవాలి. ధ్రువీకృతం కాని లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. చిరునామా, ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబరు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు