Ukraine Crisis: ఉక్రెయిన్‌లో తెలంగాణ విద్యార్థుల అవస్థలు.. స్పందించిన బండి సంజయ్‌

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లోని కీవ్‌ విమానాశ్రయంలోనే...

Updated : 24 Feb 2022 17:55 IST

హైదరాబాద్‌: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లోని కీవ్‌ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. 20 మంది భారతీయ విద్యార్థులు అవస్థలు పడుతున్నామంటూ వారి కుటుంబ సభ్యుల ద్వారా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన సంజయ్‌.. వారిని వెంటనే భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే అక్కడి భారత రాయబార కార్యాలయం పలుమార్లు అడ్వైజరీలు జారీ చేసిన విషయం తెలిసిందే. భారతీయ విద్యార్థులు ఇవాళ కీవ్‌ ఎయిర్ పోర్టుకు వెళ్లేసరికి అక్కడి ప్రభుత్వం గగనతల ఆంక్షలను విధించింది. దీంతో ఇటు భారత్‌కు రాలేక.. అటు యూనివర్సిటీకి వెళ్లలేక 20 మంది విద్యార్థులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. వీరిలో తెలంగాణ చెందిన విద్యార్థులు కడారి సుమాంజలి(కరీంనగర్‌), రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు. వీరంతా ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయిన విషయాన్ని కడారి సుమాంజలి.. తన సోదరుడు స్వామికి ఫోన్ చేసి చెప్పారు. తమను ఎటూ వెళ్లనీయడం లేదని.. అవస్థలు పడుతున్నాయని వాపోయినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను వెంటనే భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాల్సిందిగా బండి సంజయ్‌ని కడారి స్వామి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సంజయ్‌ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ.. వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతూ లేఖ రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని