Updated : 17 Jan 2022 08:24 IST

Secundrabad Club: చరిత ఘనం.. వారసత్వ అనుబంధం

విశేషాల సమాహారం సికింద్రాబాద్‌ క్లబ్‌


క్లబ్‌ భవనానికి అంటుకున్న మంటలార్పుతున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: చారిత్రక, వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. 143 ఏళ్ల చరిత్ర కలిగిన క్లబ్‌తో అనుబంధం పెంచుకున్న సభ్యులు చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్వం రాజులకు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికే సభ్యత్వం కల్పించి ఏళ్లుగా చెక్కుచెదరకుండా కనువిందు చేసిన భవనం ఇక చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోయింది. వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు క్లబ్‌ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ప్రమాద సమాచారంలో జాప్యంతోనే తీవ్ర నష్టం

ప్రమాదం జరిగిన సమయానికి, అగ్నిమాపక శాఖ సమాచారం చేరవేతలో జాప్యం కారణంగానే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. తెల్లవారుజామున 2.45గంటలకు అగ్ని ప్రమాదం సంభవించినట్లు తనకు సమాచారం వచ్చిందని సికింద్రాబాద్‌ క్లబ్‌ అధ్యక్షుడు రఘురామరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలపగా..ఉదయం 3.15గం.లకు సమాచారం తెలిసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద స్థలికి కూతవేటు దూరంలోనే ఫైర్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం. ఉదయం 3.10గం.ల సమయంలో రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోల్ట్స్‌ సిబ్బంది మంటలు ఎగిసిపడటం చూసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌తో పాటు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే 6 అగ్నిమాపక బృందాలు, ఆర్మీ ఫైర్‌ బృందం రంగంలోకి దిగాయి. స్థానిక ఫైర్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన వాహనంతో పాటు వాటర్‌ బౌసర్‌, వాటర్‌ కమ్‌ ఫోమ్‌ టెండర్‌ తదితర వాహనాలు వెళ్లాయి. అంతర్గతంగా చెక్కతో నిర్మించిన మెట్లు పూర్తిగా దగ్ధం కావడం, బయటి నుంచి నిర్మించిన మెట్ల ద్వారా మొదటి, రెండో అంతస్తుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో కిటికీల నుంచి మంటలు ఆర్పామని, దాదాపు ఎనిమిదిన్నర గంటలు శ్రమించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని, ఆస్తి నష్టం అంచనాలు లెక్కిస్తున్నామని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి.పాపయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.


వసతులు అంతర్జాతీయ స్థాయిలో..

వేలాది మంది నగరవాసులకు ప్రత్యేక అనుబంధమున్న ఈ క్లబ్‌లో అంతర్జాతీయ స్థాయి వసతులన్నీ ఉండేవి. క్రీడా మైదానం సహా ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడలకు సంబంధించి అన్ని సౌకర్యాలుంటాయి. ఎయిర్‌ కండీషన్డ్‌ బార్‌లు, డైనింగ్‌ హాళ్లు, బాంకెట్‌ హాళ్లతో పాటు భారీ సమావేశాలు, పార్టీల కోసం అనేక పచ్చిక బయళ్లు ఉన్నాయి. విశాలమైన బాల్‌ రూమ్‌, సినిమాల ప్రదర్శనకు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఉన్నాయి. పెద్ద ఫుడ్‌కోర్టు ప్రత్యేక ఆకర్షణ. కాంటినెంటల్‌ నుంచి మొఘల్‌ వరకు.. చైనీస్‌ నుంచి ఇటాలియన్‌ వరకు, ఉత్తర నుంచి దక్షిణ భారతీయ వంటకాల వరకు అనేక రకాల వంటకాలు లభించేవి. ఏటా ఇక్కడ నిర్వహించే తంబోలాలో దాదాపు వెయ్యి మంది వరకు పాల్గొంటారు. నూతన సంవత్సర వేడుకలు జరుగుతుంటాయి. మరోవైపు స్పాన్సర్‌ వేడుకలను నిర్వహించేందుకు క్లబ్‌ నిర్వాహకులు అనుమతులిస్తుంటారు. సభ్యులు సామాజిక సమావేశాలు నిర్వహించుకోవాలంటే కావాల్సిన సౌకర్యాలు క్లబ్‌ కల్పిస్తుంది.


స్థలం ప్రభుత్వానిదే.. నిర్వహణ ప్రైవేటు వ్యక్తులది

- అజిత్‌రెడ్డి, కంటోన్మెంట్‌ సీఈవో

క్లబ్‌ ఉన్న స్థలం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. నిర్వహణ కోసం లీజుకు ఇచ్చారు. ఆ భవనం చాలా ప్రాచీనమైంది అందులోనూ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. పాత భవనంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. క్లబ్‌కు ఓ ప్రత్యేక సంస్థ ఉంది. కమిటీ, సభ్యులు, నియమ నిబంధనలున్నాయి.


నాకు రెండో ఇల్లులాంటిది

- డా.పి.రఘురామ్‌, డైరెక్టర్‌, కిమ్స్‌, ఉషాలక్ష్మీ సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌

కొత్త సంవత్సరంలో ఇది విషాద ప్రారంభం. సికింద్రాబాద్‌ క్లబ్‌ నాకు రెండో ఇల్లులాంటిది. అక్కడే కుటుంబంతో గడపడం.. చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. 143 ఏళ్లనాటి అద్భుతమైన వారసత్వ నిర్మాణం కోల్పోవడం దురదృష్టకరం. అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. 30 సంవత్సరాలుగా క్లబ్‌ సభ్యుడిని, నాటి వైభవాన్ని పునరుద్ధరించడంలో నా వంతు సహకరిస్తాను.

Read latest Telangana News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని