Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుకు

Updated : 25 Jun 2022 14:21 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్‌ విధించింది. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావును సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి ఇవాళ రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న రైల్వే న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రైల్వే కోర్టు నుంచి సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆధారాలను తారుమారు చేశారు: రైల్వే ఎస్పీ అనురాధ

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో సుబ్బారావును పోలీసులు ప్రధాన సూత్రధారిగా తేల్చారు. అతనితో పాటు అకాడమీ ఉద్యోగులు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిపై రైల్వే యాక్ట్‌తో పాటు మరో 25 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృషించే విధంగా వాళ్లు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ‘‘అల్లర్ల తర్వాత సుబ్బారావు ఆధారాలను తారుమారు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చేయడానికి సుబ్బారావు యువకులను రెచ్చగొట్టారు. 16న సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్‌ వచ్చిన సుబ్బారావు, బోడుప్పల్‌లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేశారు. రైల్వే స్టేషన్లో చేసే విధ్వంసానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టు చేశారు’’ అని రైల్వే ఎస్పీ తెలిపారు.

‘‘అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ వచ్చేలా చేయాలని తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి ఆవుల సుబ్బారావు సూచించారు. సాయి డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న యువకులకు రూ.35వేలు ఇచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి సహాయ సహకారాలు అందించారు. సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి సికింద్రాబాద్ వచ్చి విధ్వంసంలో పాల్గొన్నారు. విధ్వంసానికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ ద్వారా సుబ్బారావుకు తెలిపారు. బోడుప్పల్‌లోని హోటల్‌లో కూర్చొని విధ్వంస దృశ్యాలను టీవీలో చూశారు. అగ్నిపథ్ పథకం వల్ల డిఫెన్స్ అకాడమీలు నష్టాల పాలవుతాయనే ఉద్దేశంతోనే విధ్వంసానికి కుట్ర పన్నారు. రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రం అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని కుట్ర పన్నారు. విధ్వంసం తర్వాత తన పాత్ర బయటపడకుండా వాట్సప్ గ్రూపులలోని సందేశాలను డిలీట్‌ చేశారు’’ అని ఎస్పీ అనురాధ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని