50 ఏళ్లు పైబడినవారికి మార్చిలో టీకా!

కొవిడ్‌ టీకాను ప్రస్తుతం వైద్యసిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి ఇస్తుండగా.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధులతో

Published : 22 Feb 2021 04:16 IST

అప్పుడే కొవిన్‌ యాప్‌ అందుబాటులోకి
పంపిణీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ టీకాను ప్రస్తుతం వైద్యసిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి ఇస్తుండగా.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలను ఎప్పట్నించి పంపిణీ చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 80 లక్షలమందికి టీకాలను పంపిణీ చేయాలని నిర్ణయించగా.. అందులో దాదాపు 70 లక్షలమంది 50 ఏళ్ల పైబడినవారు, సుమారు 4 లక్షలమంది ఆ వయసులోపు దీర్ఘకాలిక రోగులుంటారని అంచనా. అంటే తొలివిడతలో మొత్తం టీకాలు పొందడానికి అర్హుల్లో దాదాపు 92.5 శాతంమంది ఈ రెండు కేటగిరీలకు చెందినవారే. ఇప్పటి వరకూ స్పష్టత లేకపోయినా.. వైద్యవర్గాల సమాచారం మేరకు మార్చి రెండో వారం నుంచి ఈ రెండు విభాగాల వారికి టీకాలను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కొవిన్‌ యాప్‌లో వీరి సమాచారాన్ని పొందుపరచడం కూడా అప్పుడే ప్రారంభమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు విద్యాలయాలు, వసతిగృహాలు, సామాజిక భవనాల్లోనూ విస్తృతంగా పంపిణీ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు.
ఫోన్‌ ద్వారా ఎవరికివారే నమోదు
ప్రస్తుతం కొవిన్‌ వెబ్‌ యాప్‌ అందుబాటులో ఉండగా.. మార్చి తొలివారంలో మొబైల్‌ ఫోన్ల ద్వారా ఎవరికి వారు సొంతంగా నమోదు చేసుకునేందుకు వీలుగా కొవిన్‌ యాప్‌ అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఒకవేళ మొబైల్‌లో నమోదు చేసుకోవడానికి వీలుపడని వారికి వైద్యసిబ్బందే వెబ్‌ యాప్‌ సాయంతో సమాచారాన్ని పొందుపరుస్తారు. అయితే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభిస్తుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. టీకాలను వేయించుకోడానికి గడువు ఏమీ ఉండదనీ, నిరంతరాయంగా పంపిణీ కొనసాగుతుందని తెలిపాయి. దాదాపు 74 లక్షలమందికి టీకాలను పంపిణీ చేయడానికి కనీసం ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని