Updated : 23 Jan 2022 05:31 IST

గతుకుల్లో బతుకు బండి

 ఆటోలు, ట్యాక్సీలకు తగ్గిన గిరాకీలు  

ఫంక్షన్‌ హాళ్లు.. వేడుకల వేదికలపై కొవిడ్‌ ఆంక్షల నేపథ్యం

 క్యాటరింగ్‌.. డెకరేషన్‌, లైటింగ్‌ రంగాలూ విలవిల

 ఈనాడు, హైదరాబాద్‌

మధ్యాహ్నం ఒంటి గంట దాటుతున్నా ఒక్క గిరాకి కూడా రాకపోవడంతో అడ్డాకే పరిమితమయ్యాయి ఈ ఆటోలు. నగరంలోని హబ్సీగూడ వద్ద ఉన్న ఈ అడ్డా వద్దకు మొత్తం 51 ఆటోలు నిత్యం వస్తుంటాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో కిరాయిలు తగ్గిపోయాయని డ్రైవర్లు చెబుతున్నారు. ‘పది రోజుల నుంచి గిరాకీలు బాగా పడిపోయాయి. మున్ముందు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందోననే ఆందోళనలో ఉన్నాం. ఆటో నడిస్తేనే జీవితం సాగేది’ అని డ్రైవర్లు రాజు, బాలకృష్ణ తెలిపారు.

ఈయన పేరు గణేష్‌. పదేళ్లుగా ట్యాక్సీ నడుపుతూ నగరంలో జీవిస్తున్నారు. ఇంటి అద్దె, పది ఆపై తరగతుల్లో ఉన్న ఇద్దరు పిల్లలను చక్కగా చదివించుకుంటున్నారు. నెలకు కనీసం రూ.15 వేల ఆదాయమైనా లేనిదే కుటుంబం గడవదు. ‘నగరంలో జనాల రాకపోకలు తగ్గాయి. ఆంక్షల అమలుతో ట్యాక్సీలకు గిరాకీలు సన్నగిల్లాయి’ అని ఆయన తెలిపారు.


కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు పెంచుతోంది. జనం గుమిగూడే ప్రాంతాలను మొదట నియంత్రణలోకి తెస్తున్నారు. విద్యా సంస్థలకు ఈ నెలాఖరు వరకు సెలవులను పొడిగించారు. వీటన్నింటి ప్రభావం ఉపాధి రంగాలపై కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశల కరోనా ఉద్ధృతిని తట్టుకుని పలు రంగాలు కోలుకుంటున్న తరుణమిది. మూడో ముప్పులో ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలో నిత్యం తిరిగే ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లపై ప్రభావం కనిపిస్తోంది. జిల్లాల్లోనూ విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.


నాలుగు నెలలు సజావుగా సాగిందో లేదో...

ఎల్బీనగర్‌ నుంచి కోఠికి రోజూ విద్యార్థులను తీసుకెళ్లి.. తీసుకొచ్చే ఆటో డ్రైవర్‌ శ్రీనివాస్‌కు నెలకు రూ.10 వేల ఆదాయం వస్తోంది. ఆదాయానికి కొవిడ్‌ కుదుపులతో సతమతమవుతుండగా గతేడాది సెప్టెంబరు నుంచి మళ్లీ గిరాకీ ప్రారంభమయింది. నాలుగు నెలలు సజావుగా సాగిందో లేదో మూడో దశ రానేవచ్చింది. ‘‘నా భార్యకు చెవి నొప్పి. శస్త్రచికిత్స చేయించాలి. మరో మూడు నెలలు ఆదాయం లభిస్తే చేయిద్దామని అనుకుంటున్నా. ఇంతలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది’’ అని వివరించారు. ఇదే తీరులో డ్రైవర్‌లు రాంబాబు, శ్రీహరి కూడా ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చి అనేక మంది నగరంలో ఆటోలతో ఉపాధి పొందుతున్నారు. నగరంలో దాదాపు ఇలాంటివి ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి. కొందరు ఆటోలు బాడుగకు తీసుకుని నడుపుతున్నారు. కొన్ని ఆటోలు రెండేసి కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. పగలు ఒకరు బాడుగకు తీసుకుంటే రాత్రి ఇంకొకరు ఉపయోగించుకుంటున్నారు. అలాగే దాదాపు రెండు లక్షల మంది ఫైనాన్స్‌ సంస్థల ద్వారా అప్పు చేసి ఆటోలను కొన్నారు. నెలకు రూ.2,800 నుంచి రూ.3,400 వరకు కిస్తీలు చెల్లిస్తున్నారు. తాజాగా ఆదాయం పడిపోవడంతో కిస్తీల చెల్లింపుపై వారిలో ఆందోళన కనిపిస్తోంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు నడుపుతున్న వారికీ గిరాకీలు తగ్గిపోయాయి. ఎంజీబీఎస్‌ నుంచి నిత్యం పది ట్రిప్పుల వరకు నడిపే తమకు మూడు, నాలుగే లభిస్తున్నాయని కొందరు ట్యాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. నెలకు రూ.8 వేల వరకు కార్లకు కిస్తీ చెల్లించాల్సి ఉంటుందని వారు తెలిపారు. విమానాశ్రయానికి మాత్రమే రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయని వివరించారు.


రద్దవుతున్న ఆర్డర్లు

వేడుకలు నిర్వహించే హాళ్లకు అధికారులు కొవిడ్‌ ఆంక్షల నోటీసులు అందజేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకులు వేడుక చేసుకోవాలనుకునే వారికి తెలియజేస్తుండటంతో చాలామంది వాటిని రద్దు చేసుకుంటున్నారు. ఈ నెల 14న కొంపల్లిలోని ఓ గార్డెన్‌లో ప్రముఖుల కుటుంబానికి చెందిన ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలు రద్దయ్యాయి.  దీంతో రూ.2.30 లక్షల ఆర్డర్‌ కోల్పోయినట్లు క్యాటరింగ్‌ యజమాని ప్రవీణ్‌ తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించాల్సిన నాలుగు వేడుకలు కూడా రద్దుచేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తమతోపాటే పూల డెకరేషన్‌, లైటింగ్‌ నిర్వాహకులు గిరాకీలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.

నగరంలో ఉన్న ఆటోలు 4.50 లక్షలు

జిల్లాల్లో ఆటోలు దాదాపు 7.50 లక్షలు

నగరంలో ట్యాక్సీలు, క్యాబ్‌ల సంఖ్య 1.40 లక్షలు

 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని