Srisailam Dam: శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు!

శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో

Updated : 21 Apr 2022 09:52 IST

అదనపు వరద మళ్లింపునకు చర్యలు

మరో స్పిల్‌వే అవసరం

ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలి

తుది నివేదిక సమర్పించిన పాండ్యా కమిటీ

ఎం.ఎల్‌. నరసింహారెడ్డి

ఈనాడు - హైదరాబాద్‌

శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని సూచించింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫార్సు చేసింది. ప్రస్తుత స్పిల్‌వే సామర్థ్యానికి తగినట్లు లేదని తెలిపింది.


శ్రీశైలం డ్యాం భద్రతపై గత కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. కానీ వీటి సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా ఛైర్మన్‌గా పదిమంది నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఇదే సమయంలో 2021లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి ఓ నివేదిక సమర్పించింది. గతంలో కమిటీల సిఫార్సులు, సీడబ్ల్యూసీతోపాటు తమ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదిక ఇచ్చింది. వరద అంచనాను బట్టి, ముందుగానే డ్యాంలోని నీటిని ఖాళీ చేయడం, అదనపు స్పిల్‌వే నిర్మాణం, వరద నీటిని కుందూ లాంటి పక్క బేసిన్‌కు మళ్లించడం, ప్రస్తుత డ్యాం గరిష్ఠ నీటిమట్టం 892 అడుగులను మరింత పెంచడం, పై నాలుగు అంశాలనూ కలిపి చేయడం వంటి ప్రత్యామ్నాయాలను కమిటీ సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

అదనపు స్పిల్‌ వే అవసరం
డ్యాంకు ఎగువన అయిదు కి.మీ. దూరంలో అదనపు స్పిల్‌వే నిర్మాణానికి అవకాశం ఉంది. ప్రస్తుత స్పిల్‌వే పూర్తిగా కాంక్రీటుతో కూడుకున్నది. అదనపు స్పిల్‌వేకు బ్రీచింగ్‌ సెక్షన్‌ (అవసరమైతే గండి కొట్టే ఏర్పాటు) ఉండాలి. ఇక్కడ 2.75 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం తవ్వి మిగిలింది బయట నిర్మాణం చేపట్టవచ్చు.

* కొంత వరదను కుడివైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా చెన్నై తాగునీటికి, ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చు. ఎడమవైపున ఎగువ భాగంలో నీటిని మళ్లించడానికి అనువైన ప్రాంతం ఉంది.

* కేంద్ర జలసంఘం, ఐఎండీల వద్ద వరద అంచనాకు ఆధునిక వ్యవస్థలున్నాయి. వీటిని ఉపయోగించుకొని ముందుగానే డ్యాంలో ఉన్న నీటిని ఖాళీ చేయడం ఒక మార్గం. దీనికి పరిపాలన యంత్రాంగం చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

* ప్రస్తుత స్పిల్‌వేకు ఎక్కువ ఎత్తులో రేడియల్‌ గేట్లు ఉండేలా మార్పుచేయడం, ప్రస్తుత స్పిల్‌వే క్రస్ట్‌లెవెల్‌ తగ్గించే విషయాన్ని ఆలోచించాలి. దీనివల్ల ప్రాజెక్టు ప్రయోజనాలపై పడే ప్రభావాన్నీ పరిశీలించాలి.

* ప్రస్తుత గరిష్ఠ నీటి నిల్వ (ఎం.డబ్ల్యు.ఎల్‌)కు తగ్గట్లుగా డ్యాం ఎత్తు పెంచడానికి ముంపు సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం
‘వెయ్యేళ్లలో అత్యధిక వరద ప్రవాహం అవకాశాలపై 2006లో అధ్యయనం చేయగా, 26.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తేలింది. ప్రస్తుతం ఉన్న శ్రీశైలం స్పిల్‌వే సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్యులు. గరిష్ఠ నీటి మట్టం 890 అడుగులను పరిగణనలోకి తీసుకొంటే 14.55 లక్షల క్యూసెక్కులు. అయితే 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డ్యాంలో నీటిమట్టం 896 అడుగులకు చేరగా 14.80 లక్షల క్యూసెక్కులు గేట్ల ద్వారా బయటకు వదిలారు. 2006లో గరిష్ఠ వరద ప్రవాహంపై అధ్యయనం చేస్తే 2009లోనే దానికి దగ్గరగా వచ్చింది. కానీ 2021లో అధ్యయనం చేసిన కేంద్ర జలసంఘం దీనిపై ఏమీ మాట్లాడలేదు. మా అధ్యయనం ప్రకారం గరిష్ఠ వరద 17.88 లక్షల క్యూసెక్కులు. మొత్తం పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు 256 ఉప పరీవాహక ప్రాంతాలుగా విభజించి సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. 1964 సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు కుంభవృష్టి కురిసింది. ఆత్మకూరు ప్రాంతంలో మూడు రోజుల్లోనే 600 మి.మీ. వర్షపాతం నమోదైంది’ అని పాండ్యా కమిటీ తన నివేదికలో పేర్కొంది. డ్యాం భద్రతకు చర్యలు ప్రారంభించే ముందు పీఎంఎఫ్‌పై మళ్లీ అధ్యయనం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.


ప్లంజ్‌పూల్‌ భద్రతకు గుంత..

స్పిల్‌వే గేట్ల నుంచి నీళ్లు కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం (ప్లంజ్‌పూల్‌)లో ఏర్పడిన భారీ గుంత డ్యాం భద్రతకు ముప్పు. రెండువైపులా గట్లు, పునాది ఇలా అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దీనిపై వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి. భూభౌతిక శాస్త్రవేత్తలతో అంచనా వేయించాలి. ఇప్పటికే నష్టం జరిగిన ప్రొటెక్టివ్‌ సిలిండర్స్‌ రీహాబిటేషన్‌పై చర్యలు తీసుకోవాలి.

* ప్లంజ్‌పూల్‌ కుడి, ఎడమగట్లకు తదుపరి నష్టం వాటిల్లకుండా మరమ్మతులు చేపట్టాలి. డ్యాం గ్యాలరీలో డ్రెయిన్ల సరిచేత, పటిష్ఠమైన కమ్యునికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన స్పిల్‌వే గేట్ల నుంచి నీటి లీకేజీ నివారణ వంటి చర్యలు తీసుకోవాలి.

* రివర్‌ స్లూయిస్‌ గేట్ల నిర్వహణ చాలా కాలంగా సరిగా లేదు. అత్యవసర సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తక్షణమే దృష్టి పెట్టాలి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు