తెలంగాణకు గుజరాత్‌ పల్లీనూనె

పచ్చళ్ల తయారీ సీజన్‌ కావడంతో వేరుసెనగ(పల్లీ) నూనెకు భారీగా డిమాండు పెరిగింది. తెలంగాణలో ఈ నూనె తయారీ లేకపోవడంతో ఏపీ నుంచి ఇక్కడి వ్యాపారులు కొనేవారు. కానీ అక్కడ గత నెలలో కరెంటు కోతల వల్ల ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్‌ నుంచి ‘తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల

Published : 21 May 2022 07:49 IST

ఏపీలో కరెంటుకోతలతో తగ్గిన ఉత్పత్తి
పచ్చళ్ల సీజన్‌ కావడంతో అధికంగా తెప్పించిన ఆయిల్‌ఫెడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పచ్చళ్ల తయారీ సీజన్‌ కావడంతో వేరుసెనగ(పల్లీ) నూనెకు భారీగా డిమాండు పెరిగింది. తెలంగాణలో ఈ నూనె తయారీ లేకపోవడంతో ఏపీ నుంచి ఇక్కడి వ్యాపారులు కొనేవారు. కానీ అక్కడ గత నెలలో కరెంటు కోతల వల్ల ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్‌ నుంచి ‘తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్‌ఫెడ్‌) పెద్దయెత్తున తెప్పిస్తోంది. గుజరాత్‌కన్నా తెలంగాణ, ఏపీలోనే నాణ్యమైన వేరుసెనగలు పండుతాయి. కానీ ఇక్కడ పంట పెద్దగా లేకపోవడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్‌ నూనెమిల్లులపైనే ఆధారపడాల్సి వచ్చింది. పచ్చళ్ల తయారీకి ఎక్కువమంది టోకుగా కొనడంతో పాటు పొద్దుతిరుగుడు నూనె ధర ఏకంగా రూ.200 దాటడంతో పల్లీనూనె వాడకంవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నందున దీని అమ్మకాలు పెరిగినట్లు సమాఖ్య పరిశీలనలో తేలింది. డీజిల్‌ ధర పెరుగుదలతో రవాణా కిరాయిలు కూడా నూనె ధరలో కలిపి ప్రజల నుంచి వ్యాపారులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా నెలకు 800 టన్నుల పల్లి నూనెను విక్రయించే ఆయిల్‌ఫెడ్‌ గతనెలలో 1300, ఈ నెలలో 2 వేల టన్నులను విక్రయిస్తోంది. దీని ధర లీటరకు రైతు బజార్లలో రూ.171 ఉండగా బయటి మార్కెట్‌లో రూ.180కి అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు సాధారణంగా పొద్దుతిరుగుడు నూనెను అధికంగా కొంటాయి. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో ఈ నూనె ధర ఏకంగా రూ.200కి చేరింది. ప్రస్తుతం రైతుబజార్లలో ఆయిల్‌ఫెడ్‌ ‘విజయ’ బ్రాండు పేరుతో విక్రయించే పొద్దుతిరుగుడు ప్రీమియం వంటనూనె లీటరురూ.196గా ఉంది.

పామాయిల్‌పైనే ఆశలు...
మనదేశానికి ఇండోనేసియా, మలేసియా దేశాల నుంచి పామాయిల్‌ దిగుమతి అవుతోంది. కానీ గత నెలలో ఈ నూనె ఎగుమతిపై ఇండోనేసియా ఆంక్షలు విధించడంతో దీని ధర లీటరుకు అదనంగా రూ.10 వరకూ నెలవ్యవధిలోనే పెరిగింది. తిరిగి ఈ నెల 23 నుంచి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేస్తామని తాజాగా ప్రకటించడంతో నూనె వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండోనేసియా నుంచి తిరిగి ఎగుమతులు ప్రారంభమైతే  ధర ఇక్కడ తగ్గుతుందని, లభ్యత పెరిగితే ఇతర వంటనూనెల ధరలు తగ్గేసూచనలున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ తాజా అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు