మాదకద్రవ్యం అనే మాటే వినిపించొద్దు

మాదకద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యం అనే మాటే వినిపించకుండా

Published : 27 Jan 2022 05:26 IST

నిందితులెవరైనా ఉపేక్షించకండి

యంత్రాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యం అనే మాటే వినిపించకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రత్యేక దళం ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రగతిభవన్‌లో  బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం నిర్వహించి ఈ విషయం స్పష్టం చేశారు.

వెయ్యి మందితో ప్రత్యేక దళం

తెలంగాణలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక దళం ఏర్పాటు కానుంది. నార్కొటిక్‌ అండ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ పేరిట వెయ్యి మందితో బృందం రంగంలోకి దిగనుంది. ఈ విభాగం డీజీపీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

28న పోలీస్‌, ఎక్సైజ్‌ కాన్ఫరెన్స్‌

ప్రత్యేక దళం విధివిధానాలపై చర్చించేందుకు ఈనెల 28న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. మాదకద్రవ్యాల కట్టడికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశంపై హోం, ఎక్సైజ్‌ శాఖల మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల ఎస్పీలు, డీసీపీలు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లతో సమీక్ష చేపట్టనున్నారు.

మరింత కట్టడి దిశగా అడుగులు

మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రణాళిక చేపట్టాలని లోగడ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పోలీసులు, ఎక్సైజ్‌ బృందాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నా మాదకద్రవ్యాల కట్టడి సాధ్యం కావడంలేదు. ముఖ్యంగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఏవోబీ నుంచి హైదరాబాద్‌ మీదుగా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు తరలింపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు నైజీరియన్‌ స్మగ్లర్‌ టోనీ అనుచరులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాల్ని విక్రయించినట్లు ఇటీవలే బహిర్గతమైంది. ఈనేపథ్యంలో తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేసే క్రమంలో కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని