రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘిస్తూ.. అన్ని అధికారాలను కేంద్రం

Published : 26 Jan 2022 05:14 IST

అఖిల భారత సర్వీసు నిబంధనల మార్పు ప్రతిపాదన ప్రమాదకరం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌ - తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారాట్‌ అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘిస్తూ.. అన్ని అధికారాలను కేంద్రం చేతిలో పెట్టుకునేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు.  రాష్ట్రాల అనుమతి లేకుండా ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారులను ఏకపక్షంగా తీసుకునేలా తెచ్చిన సవరణ ప్రతిపాదన ఇందుకు తాజా ఉదాహరణని వ్యాఖ్యానించారు. ఇది చాలా ప్రమాదకర నిర్ణయమని దుయ్యబట్టారు. హైదరాబాద్‌ శివారులో 4 రోజుల పాటు జరిగిన తెలంగాణ సీపీఎం మూడో మహాసభలకు హాజరైన ఆయన చివరిరోజు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో భాజపా రాక ప్రమాదకరం.. అడ్డుకుంటాం

‘‘త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తుంది. తెరాస ఎంపీలు ఇంతకాలం పార్లమెంట్‌లో భాజపాకు అనుకూలంగా వ్యవహరించినా.. ఇప్పుడిప్పుడే వ్యతిరేకించడం మొదలెట్టారు. భాజపాను వ్యతిరేకించే విషయంలో తెరాసకు మా మద్దతు ఉంటుంది. తెలంగాణలో భాజపా రాక ప్రమాదకరం. రాకుండా అడ్డుకుంటాం. అదే సమయంలో ప్రజలకు నష్టం చేసే ఏ నిర్ణయం తీసుకున్నా తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాం.  దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా విద్య, వైద్యం, మౌలిక వసతులకు కేంద్ర బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేయాలి. పేద ప్రజలందరికీ నెలకు రూ.7,500 నగదు పంపిణీ చేయాలి. ఫలితంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గిరాకీ ఏర్పడుతుంది’’ అని కారాట్‌ పేర్కొన్నారు.


రాష్ట్ర కార్యదర్శిగా మూడోసారి ఎన్నికైన తమ్మినేని 

 

హాసభల ముగింపు రోజున రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా తమ్మినేని వీరభద్రం మూడోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 60మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా మహాసభ ఎన్నుకుంది. ఇందులో 14మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, 8మంది రాష్ట్ర కమిటీకి ఆహ్వానితులుగా, నలుగురు  ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారు. అయిదుగురితో కంట్రోల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎస్‌.వీరయ్య, సీహెచ్‌ సీతారాములు, జి.నాగయ్య, చుక్కా రాములు, బి.వెంకట్‌, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్‌, డి.జి.నర్సింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్‌, టి.సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లు లక్ష్మి ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని