MK Stalin: ‘వణక్కం’ అనే మాటతో మోసం చేయలేరు: స్టాలిన్‌

‘వణక్కం’ అనే ఒక్క మాటతో తమిళులను మోసం చేయలేరని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లా నుంచి పోటీ చేస్తున్న డీఎంకే, కూటమి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా చెన్నై నుంచి వీసీలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Updated : 12 Feb 2022 07:03 IST

ప్రధానిపై తమిళనాడు సీఎం విమర్శలు

చెన్నై, న్యూస్‌టుడే: ‘వణక్కం’ అనే ఒక్క మాటతో తమిళులను మోసం చేయలేరని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లా నుంచి పోటీ చేస్తున్న డీఎంకే, కూటమి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా చెన్నై నుంచి వీసీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించడానికి పులువురు ప్రయత్నించినా వాటిని కరుణానిధి అధిగమించారని పేర్కొన్నారు. వరద సాయం కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశానని, ఇప్పటివరకు నిధులు అందలేదని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రులందరూ సందర్శించి వెళ్లినా లాభంలేదని పేర్కొన్నారు. జీఎస్టీ, విపత్తు సాయం, ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రాలకు అందాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తే జవాబు రాదని తెలిపారు. అయితే ‘వణక్కం’ అని చెబితే తమిళులు మోసపోతారని భావిస్తున్నారని, తమిళులు మోసపోరని వ్యాఖ్యానించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్‌’ విధానం ద్వారా రాష్ట్రాల ఆదాయాన్ని తీసుకోవాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాష్ట్రాల యూనియన్‌ అని రాహుల్‌గాంధీ సంబోధిస్తే ప్రధానికి ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని విషయాన్నే రాహుల్‌ వెల్లడించారని తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల అధికారాలు, హక్కులు గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం మోదీ మరిచారా? అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని