వారి ఇళ్లపై వారే దాడులు చేసుకున్నారు

వైకాపా ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమలాపురంలో గొడవలు జరిగాయని, వారి ఇళ్లపై వారే దాడులు చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్సీ

Published : 26 May 2022 05:18 IST

దళిత యువకుడి హత్యపై ఎస్సీల్లో వ్యతిరేకత నుంచి బయటపడేందుకే దాడులకు ప్రణాళిక

వైకాపాపై విరుచుకుపడ్డ పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: వైకాపా ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమలాపురంలో గొడవలు జరిగాయని, వారి ఇళ్లపై వారే దాడులు చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వైకాపా ఎమ్మెల్సీ చేతిలో మాజీ డ్రైవరు హత్య నేపథ్యంలో.. తమ ప్రభుత్వంపై ఎస్సీల్లో నెలకొన్న వ్యతిరేకతను మళ్లించే పథకంలో భాగంగానే ఇదంతా చేశారని దుయ్యబట్టారు. కోనసీమ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ఘర్షణలు జరగాలనే కుట్రతోనే.. ఏప్రిల్‌ 4న కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టలేదని మండిపడ్డారు. ‘ఒక్క మాట అంటేనే వందల మంది పోలీసుల్ని పెడతారే..! అలాంటిది అమలాపురంలో దాడులు జరుగుతుంటే పోలీసుల్ని ఎందుకు మోహరించలేదు? అంటే గొడవ జరగాలనే ఆలోచనతో ఇలా చేశారా?’ అని నిలదీశారు. బుధవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ‘మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై మీరే దాడి చేయించుకుని.. ఎదుటివారిపై మాట్లాడుతున్నారు. కుల వివాదాన్ని సృష్టించి పబ్బం గడపాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించే వ్యక్తులు చెప్పిన దానికి ఊ కొడితే తర్వాత మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు సూచించారు. 

దురుద్దేశం లేదా?
* ‘కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును మిగిలిన జిల్లాలతో కాకుండా ఇప్పుడెందుకు పెట్టారు? 18వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చి 30 రోజుల వ్యవధిలో అభ్యంతరాలు తెలియజేయమన్నారు. అంటే గొడవలను కోరుకుంటున్నారా?

* అంబేడ్కర్‌ పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా ఉంటే రాష్ట్రంలో 25 జిల్లాలున్నాయి. కడప జిల్లాకూ స్ఫూర్తి ప్రదాత పేరు పెట్టొచ్చు. కడపను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకైనా ఆయన పేరు పెట్టొచ్చు కదా?

* సాధారణంగా ఎక్కడైనా ఇంటిమీద దాడికి వస్తున్నారన్నప్పుడు పోలీసులు.. రక్షణ వలయం ఏర్పాటుచేసి కాపాడాలి. అలా చేయకుండా ఇంట్లోని వారిని తరలించేశారు. ఇదంతా చూస్తుంటే పద్ధతి ప్రకారమే చేశారని తెలియడం లేదా?

* నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దని మంత్రులకు చెబుతున్నా. వైకాపాలో మేధావులు, సజ్జల లాంటి పెద్దలున్నారు. మీ అనుభవం రాష్ట్రంలో కులాల మధ్య వైషమ్యానికి దారితీస్తే.. మీ పెద్దరికం ఏమవుతుందో ఆలోచించుకోండి’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని