Sajjanar: ఆర్టీసీ బస్సెక్కి.. బాధలు తెలుసుకుని..!

ప్రతి గురువారం ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ డే’గా పాటించాలని ప్రకటించిన సజ్జనార్‌ స్వయంగా సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల బాధలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి లక్డీకాపుల్‌ మీదుగా టెలిఫోన్‌ భవన్‌ వరకు కాలినడకన వచ్చి.

Updated : 10 Dec 2021 17:04 IST

బస్‌ డే సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఎండీ సజ్జనార్‌ ప్రయాణం

బస్సులో సాధారణ ప్రయాణికుడిలా టికెట్‌ తీసుకుంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి గురువారం ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ డే’గా పాటించాలని ప్రకటించిన సజ్జనార్‌ స్వయంగా సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల బాధలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి లక్డీకాపుల్‌ మీదుగా టెలిఫోన్‌ భవన్‌ వరకు కాలినడకన వచ్చి.. అక్కడ మెహిదీపట్నం డిపోకు చెందిన 113/ఐ/ఎం బస్సెక్కి టికెట్‌ తీసుకున్నారు. సచివాలయం మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని బస్‌భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు టెలిఫోన్‌ భవన్‌ బస్టాపులో ఉన్న ప్రయాణికులతో సజ్జనార్‌ ముచ్చటించారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, బస్సుల్లో శుభ్రత, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సేవలపైనా వాకబు చేశారు. బస్సులో విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.

స్టాపుల్లో డ్రైవర్‌ బస్సు ఆపుతున్న తీరు.. కండక్టర్‌ ప్రయాణికులతో వ్యవహరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. సౌకర్యవంతంగా కార్యాలయానికి చేర్చినందుకు డ్రైవర్‌, కండక్టర్లను సజ్జనార్‌ అభినందించారు. బస్సుల్లో ప్రయాణిస్తే ప్రయాణికుల కష్టాలు, అవసరాలు తెలుస్తాయని అన్నారు. వారంలో ఒకసారి ఇలా చేసి ఇబ్బందులు తెలుసుకుని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందేలా చూడొచ్చని అధికారులకు సజ్జనార్‌ సూచించారు. ఎండీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారి నుంచి క్లర్కు వరకూ అందరూ గురువారం బస్సులోనే ప్రయాణించి విధులకు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని