సర్వోమాక్స్‌ ఎండీ వెంకటేశ్వరరావు అరెస్ట్‌

వ్యాపార నిర్వహణ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించారనే కేసులో హైదరాబాద్‌లోని సర్వోమాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌ఐపీఎల్‌) ఎండీ

Published : 19 Jan 2022 03:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార నిర్వహణ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించారనే కేసులో హైదరాబాద్‌లోని సర్వోమాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌ఐపీఎల్‌) ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. 2018 ఫిబ్రవరి 2న సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ నిధుల మళ్లింపు కోణంలో ఈ కేసును దర్యాప్తు చేసింది. ఈడీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్తు ఉపకరణాల ఉత్పత్తి రంగంలో ఉన్న సర్వోమాక్స్‌ సంస్థ ఎండీ వెంకటేశ్వరరావు వ్యాపార నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు రాబట్టేందుకు తప్పుడు పత్రాలను రూపొందించారు. 50కిపైగా కంపెనీలను తెరపైకి తెచ్చి పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు బోగస్‌రికార్డులు సృష్టించారు. తప్పుడు లెటర్‌ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ)లను జారీ చేయడం ద్వారా ఎస్‌బీఐతోకూడిన బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకున్నారు. అనంతరం ఆనిధుల్ని వ్యక్తిగత అవసరాలకు, ఇతర పనుల కోసం మళ్లించి వాయిదాలు చెల్లించకుండా ఎగవేశారు. దీంతో ఆ ఖాతాలను బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. అయినప్పటికీ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ) ద్వారా బినామీ సంస్థలపై తన పట్టు నిలుపుకొని తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే సర్వోమాక్స్‌ సంస్థ వెబ్‌సైట్‌ను అక్రమ పద్ధతిలో తన ఆధీనంలోనే ఉంచుకొని అడ్డదారుల్లో బ్యాంకులకు రూ.402 కోట్ల నష్టం చేకూర్చినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని