
అచ్చంపేట సీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన మహిళకు కొవిడ్ ఉందనే కారణంతో ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు చికిత్సకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ మహిళ ఆసుపత్రి గేటు వద్దే ప్రసవించింది. ఈ అంశం వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి రావడంతో సత్వరమే స్పందించి, సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అచ్చంపేట సీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుడు హరిబాబును, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. వీరిద్దరిని వారి మాతృసంస్థ అయిన ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోకి సరెండర్ చేశారు. ఈ వైద్యులిద్దరిపై శాఖపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ గర్భిణులకు కొవిడ్ ఉన్నట్లు తేలినా చికిత్స అందించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి నిరాకరించిన వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.