న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బాధిత కుటుంబసభ్యులు స్పందించారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తన భర్తకు ఎలా శిక్ష వేశారో.. ఎన్‌కౌంటర్‌ చేసిన వారినీ అలాగే శిక్షించాలని చెన్నకేశవులు భార్య రేణుక తెలిపింది.

Published : 21 May 2022 06:11 IST

ఎన్‌కౌంటర్‌ మృతుల తల్లిదండ్రుల అభిప్రాయాలు

ఈనాడు డిజిటల్‌- మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే- మక్తల్‌ గ్రామీణం: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బాధిత కుటుంబసభ్యులు స్పందించారు. తమకు హైకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తన భర్తకు ఎలా శిక్ష వేశారో.. ఎన్‌కౌంటర్‌ చేసిన వారినీ అలాగే శిక్షించాలని చెన్నకేశవులు భార్య రేణుక తెలిపింది.


హైకోర్టులో గెలుస్తామన్న నమ్మకం ఉంది



మేం హైకోర్టులో గెలుస్తామన్న నమ్మకం ఉంది. మా బిడ్డలను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు శిక్ష విధించాలి. ఉన్న ఒక్క కొడుకు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. న్యాయం జరిగే వరకు పోరాడతాం.   

   - ఆరిఫ్‌ తండ్రి హుసేన్‌


మూడేళ్లు హైకోర్టుకు తిరిగా

ఎన్‌కౌంటర్‌పై మూడేళ్లు హైకోర్టుకు తిరిగాం. కమిషన్‌ను కూడా కలిశాం. మా పిల్లలను దొంగ ఎన్‌కౌంటర్‌ చేశారని చెప్పాం. ఎన్‌కౌంటర్‌ చేసిన వారికి శిక్షపడాలి. న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకుంది.

   - జొల్లు శివ తండ్రి రాజప్ప


మా జీవితాలు ఆగమయ్యాయి

నా కొడుకును ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత మా కుటుంబం రోడ్డున పడింది. ఆ సమయంలో నా భర్త కురమయ్య కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.  మా జీవితాలు మొత్తం ఆగమయ్యాయి. మా కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.      

- చెన్నకేశవులు తల్లి జయమ్మ


చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?

అత్యాచారం కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే ఎన్‌కౌంటర్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లలు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్షించాలి. పోలీసులు తీసుకెళ్లి ఎందుకు కాల్చి చంపారు? ఎన్‌కౌంటర్‌ చేసిన వారికి శిక్ష పడాలి.                     

 - జొల్లు నవీన్‌ తల్లి లక్ష్మి


మాకు తీరని అన్యాయం జరిగింది: దిశ కుటుంబం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: దిశ నిందితులను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని జస్టిస్‌ వి.ఎస్‌.సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికలో పేర్కొనడం బాధాకరమని దిశ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల సంరక్షణ కోసం వైద్య సేవలందించిన ఆమెను దారుణంగా అంతమొందించిన హృదయ విదారక ఘటన నేటికీ తమ గుండెలను పిండేస్తోందన్నారు. తమ కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని.. ఇప్పటికీ ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని