Published : 22 May 2022 05:14 IST

కీలక సమయాల్లో సీసీ కెమెరాలు పనిచేయవా?

పేరుకే దేశంలో సగం.. పనితీరులో అధ్వానం
సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికతో డొల్లతనం మరోసారి బహిర్గతం

ఈనాడు - హైదరాబాద్‌:  ‘దిశ’ హత్యాచారం కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పుడు నిందితులపై కోపంతో ఉన్న స్థానికులు ఠాణాలోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాటి ఘటనలను పరిశీలించేందుకు వీడియో ఫుటేజీ కావాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ కోరగా.. ఠాణాలో సీసీ కెమెరాలు పనిచేయలేదనేది పోలీసుల సమాధానం.

భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్‌ డెత్‌కు గురైంది. అసలు ఠాణాలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే ఆ సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదనే సమాధానమే వచ్చింది. తెలంగాణ పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఉదంతాలే తార్కాణాలు. ప్రజాభద్రత చట్టాన్ని అనుసరించి సీసీకెమెరాల ఏర్పాటులో దేశానికే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర పోలీస్‌శాఖ తరచూ చెప్పే మాట. తమ చొరవతో రాష్ట్రంలో ఇప్పటికే 8 లక్షలకుపైగా కెమెరాలు ఏర్పాటయ్యాయని ఆశాఖ వర్గాలు చెబుతుంటాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా.. కీలక సమయాల్లో కెమెరాలు పనిచేయవనేది ఘాటుగా వినిపించే విమర్శ. తాజాగా సుప్రీంకోర్టుకు జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక సైతం ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది.

‘దిశ’ ఉదంతంలో.. 

శంషాబాద్‌ శివార్లలోని తొండుపల్లి టోల్‌ప్లాజా నుంచి నిందితులు ‘దిశ’ను అపహరించింది మొదలు జాతీయరహదారిపై సుమారు 20కి.మీ.ల దూరంలో ఆమె మృతదేహాన్ని తగలబెట్టిన చటాన్‌పల్లి వంతెన వరకు ఎక్కడా సమగ్రమైన సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించలేకపోయారు. నిందితులను అరెస్ట్‌ చేసి షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచినప్పుడు అక్కడా కెమెరాలు పనిచేయలేదు. నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకున్న తర్వాత ‘సేఫ్‌ హౌస్‌’ పేరుతో వారిని ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంచారు. అక్కడా సీసీ కెమెరాల్లేవు. అక్కడి నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం వరకూ ఎక్కడా ఫుటేజీని సేకరించలేదు. కీలకమైన ఈ కేసులో సమగ్రమైన సీసీ ఫుటేజీని సేకరించాల్సిన అవసరం కనిపించలేదని కేసు దర్యాప్తు చేసిన అధికారి సురేందర్‌రెడ్డి కమిషన్‌కు చెప్పడం గమనార్హం. ఈ పరిణామంతో పోలీసులు ‘అవసరమైనప్పుడు’ కావాలనే కెమెరాలను పనిచేయనీయకుండా చేస్తారనే అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని