31న కొనుగోళ్లు బంద్‌

పెట్రోలియం డీలర్లకు కమీషన్‌ పెంచాలని కోరుతూ ఈ నెల 31న ఆయిల్‌ డిపోల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనరాదని నిర్ణయించినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమర్‌నాథ్‌రెడ్డి

Updated : 28 May 2022 06:52 IST

పెట్రోలియం డీలర్ల సంఘం నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలియం డీలర్లకు కమీషన్‌ పెంచాలని కోరుతూ ఈ నెల 31న ఆయిల్‌ డిపోల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనరాదని నిర్ణయించినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎం.అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. 2017 నుంచి కమీషన్‌ పెంచకపోవడంతో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో డీలర్లు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌పీసీఎల్‌ రాష్ట్ర సమన్వయకర్త ఎతేంద్ర పాల్‌సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ‘‘2017 నుంచి పెట్రోలియం ధరలు దాదాపు రెండింతలయ్యాయి. పెట్టుబడులు, ఖర్చులు అదే స్థాయిలో పెరిగాయి. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో డీలర్ల మార్జిన్లు పెంచాలని కంపెనీల దృష్టికి తెచ్చినా అంగీకరించలేదు. అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు పెరగకున్నా 2017 నుంచి ఎక్సైజ్‌ డ్యూటీ మూడుసార్లు పెంచారు. వాటి ఫలాలు చమురు సంస్థల మేలుకు మళ్లించారు. డీలర్లకు ఎలాంటి మార్జిన్‌ పెంచలేదు. స్టాకు ఎక్కువగా పెట్టుకోవాలని సూచిస్తూ సెలవులు, వారాంతాల్లో డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్సైజ్‌ డ్యూటీ లాభనష్టాలతో సంబంధం లేకుండా డీలర్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో ప్రజలకు మేలు జరిగినా, ఆ మొత్తాన్ని ముందుగానే చెల్లించి ఉత్పత్తులు కొనుగోలు చేసిన డీలర్లకు తిరిగి చెల్లింపులు చేయాలి. డీలర్లకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాం’’ అని లేఖలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని