సీఏకు అమ్మాయిల సై

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ)గా స్థిరపడేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఛార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఫౌండేషన్‌ కోర్సులో చేరుతున్న అమ్మాయిలు  45 శాతం దాటారు. అందులో ప్రవేశిస్తున్న అమ్మాయిలు ఏటా ఒక శాతం పెరుగుతున్నట్లు

Published : 20 Aug 2022 05:05 IST

కొత్తగా చేరేవారిలో 45 శాతం వారే
ఉత్తీర్ణతలోనూ అబ్బాయిలతో పోటాపోటీ
ఈనాడు - హైదరాబాద్‌

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ)గా స్థిరపడేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. దేశంలో ఛార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఫౌండేషన్‌ కోర్సులో చేరుతున్న అమ్మాయిలు  45 శాతం దాటారు. అందులో ప్రవేశిస్తున్న అమ్మాయిలు ఏటా ఒక శాతం పెరుగుతున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2011లో 54,416 మంది(36.54శాతం) బాలికలు ఫౌండేషన్‌ కోర్సులో ప్రవేశించగా.. 2021లో అలా చేరినవారి సంఖ్య 54,960. ఆ ఏడాది మొత్తం చేరిన విద్యార్థుల్లో అది 45.48 శాతానికి సమానం. దీన్ని బట్టి ఆ కోర్సులో చేరే అబ్బాయిల సంఖ్య తగ్గిపోతుండగా.. అమ్మాయిల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పదేళ్లలో బాలికల వాటా 9శాతం పెరిగింది.

ఉత్తీర్ణతలోనే కాదు.. టాపర్లలోనూ ముందంజ

కోర్సులో చేరేవారి శాతం పెరగడంతోపాటు ఉత్తీర్ణతలోనూ అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే మెరుగ్గా ఉన్నారు. ఉదాహరణకు 2021 జులై ఫౌండేషన్‌ కోర్సులో 27.26 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. అది అబ్బాయిల కంటే 1.18 శాతం అధికం. అదే ఏడాది డిసెంబరులో 30.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే 0.17 శాతం ఎక్కువ. మూడు స్థాయుల్లో జరిగే పరీక్షల్లోనూ అమ్మాయిలు టాపర్లుగా నిలుస్తున్నారు. గత పదేళ్లలో ఫౌండేషన్‌ పరీక్షల్లో 15 మంది, ఇంటర్‌మీడియట్‌లో 26, ఫైనల్‌ పరీక్షల్లో 28 మంది అగ్ర ర్యాంకులు సాధించారు.

సీఏల్లో 28 శాతం

సీఏ కోర్సు పూర్తిచేసి ఐసీఏఐ సభ్యత్వం తీసుకున్న అమ్మాయిల శాతం 28కి చేరింది. అది 2014లో 22 శాతమే. ఆనాడు 50వేల మంది మహిళా సీఏలు ఉండగా 2017లో 64,685కి పెరిగింది. ఆ సంఖ్య 2018లో 70,047; 2019- 73,807; 2020- 81,564; 2021-88,983కి పెరగడం విశేషం. ఐసీఏఐలో 2021 ఏప్రిల్‌ నాటికి మొత్తం 3.27 లక్షల మంది సీఏలకు సభ్యత్వం ఉంది.


అమ్మాయిలకు కంపెనీలూ ప్రాధాన్యమిస్తున్నాయి

-ఎం.దేవరాజ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, ఐసీఏఐ

మెడికల్‌ కోర్సులతో పోల్చుకుంటే ఫీజులు తక్కువ. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో పోటీ విపరీతంగా ఉండటంతో తల్లిదండ్రులు సీఏ వైపు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి కోచింగ్‌ తీసుకొని తప్పినా ఇంటి నుంచి సన్నద్ధమవ్వొచ్చు. సీఏ ఫైనల్‌ రాసేముందు చేసే ఆర్టికల్‌షిప్‌లో ప్రతి నెలా స్టైపండ్‌ ఇస్తుండటంతో వారి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది. చదువు పూర్తయితే కొలువుల్లో చేరొచ్చు. కనీసం రూ.15లక్షల వార్షిక వేతనం పొందుతారు. బ్యాంకింగ్‌, బీమా, స్టాక్‌ మార్కెట్‌ రంగాల్లో సీఏల అవసరం మరింత పెరిగింది. ఇన్ఫోసిస్‌, డెలాయిట్‌ వంటి కంపెనీలు ఎక్కువగా తీసుకుంటున్నాయి. ఒక్క ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ ప్రాంగణంలోనే 2వేల మంది సీఏలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఇటీవల రైల్వేశాఖ కూడా సీఏలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పెళ్లయ్యాక ఇతర దేశాలకు వెళ్లినా అక్కడా ఉద్యోగం చెయ్యొచ్చు. అమ్మాయిలు సహనంతో సాధన చేయగలటం వల్ల వారిలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని