అక్రమార్కుల సరికొత్త దందా

పొలాల్లో వరి ఇంకా పొట్టపోసుకోలేదు. పంట చేతికందటానికి ఇంకా కనీసం నెల వ్యవధి ఉంది. మరోవంక, ధాన్యాన్ని ఇప్పుడే మార్కెట్‌ యార్డుకు తెస్తుండటం అనుమానాలకు

Published : 26 Sep 2022 04:10 IST

కోతలకు ముందే మార్కెట్‌కు ధాన్యం

సూర్యాపేట జిల్లాలో రూ.కోట్ల ధాన్యం పక్కదారి

ఈనాడు, హైదరాబాద్‌: పొలాల్లో వరి ఇంకా పొట్టపోసుకోలేదు. పంట చేతికందటానికి ఇంకా కనీసం నెల వ్యవధి ఉంది. మరోవంక, ధాన్యాన్ని ఇప్పుడే మార్కెట్‌ యార్డుకు తెస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులు ధాన్యం దందాకు తెర తీశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం 1,326 బస్తాల ధాన్యాన్ని కొందరు కమీషన్‌ ఏజెంట్లు రైతుల పేరిట సూర్యాపేట మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. మార్కెట్‌లో ప్రస్తుతం ధాన్యం ధర ఎక్కువగానే ఉండటంతో.. మిల్లుల్లో ఉన్న దాన్ని రైతుల పేరిట మార్కెట్‌ యార్డుకు తెచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది మిల్లర్లకు కస్టం మిల్లింగ్‌ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యమా అన్న అనుమానాలూ రేగుతున్నాయి. అది కూడా ప్రభుత్వ లోగో ఉన్న గోనెసంచుల్లో తీసుకురావటం ఈ అనుమానాలకు మరింత బలమిస్తోంది. ఆ ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్న మార్కెట్‌యార్డు అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

ఆ గోనెసంచులు ఎక్కడివి?
మార్కెట్‌ యార్డుకు తరలించిన గోనెసంచులు ఏ జిల్లాకు, ఏ సంవత్సరానికి చెందినవన్న వివరాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతి సీజను ప్రారంభానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వ లోగోతో ముద్రించిన గోనెసంచులను జిల్లాలవారీగా కేటాయిస్తారు. కొన్న ధాన్యాన్ని వాటిలో నింపి మిల్లులకు పంపుతారు. ఆ సంచులను ఏయే మిల్లుల నుంచి సమీకరించారన్నది తెలియాల్సి ఉంది. తాజాగా యార్డుకు వచ్చిన ధాన్యం సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం పాలెఅన్నారం గ్రామానికి చెందినదిగా చెబుతున్నా తరలింపునకు వినియోగించిన లారీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి.

ధాన్యం అక్రమాలకు సూర్యాపేట జిల్లా అడ్డాగా మారింది. ప్రతి సీజనులోనూ అక్కడ అవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు మూసివేశాక వందల టన్నులు కొనుగోలు చేసి రవాణా చేసినట్లు రికార్డులు సృష్టించారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం వేశారు. 2020-21 యాసంగి సీజనులో రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లోని మిల్లర్లు 1.67 లక్షల టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ప్రభుత్వం ధాన్యం ఇచ్చిన 18 నెలలకు కూడా వారు పౌరసరఫరాల శాఖకు కానీ, ఇటు ఎఫ్‌సీఐకి కానీ బియ్యాన్ని ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో మిల్లర్ల నుంచి 25 శాతం అపరాధ రుసుముతో బియ్యాన్ని రాబట్టాలంటూ పౌరసరఫరాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని