317 జీఓ చిక్కుముళ్లు వీడేదెన్నడో?

రాష్ట్రంలో 317 జీఓ ఆధారంగా ఉపాధ్యాయులను కొత్త జిల్లాలవారీగా కేటాయించి తొమ్మిది నెలలైనా ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో అంతుచిక్కడం లేదు. సీనియారిటీ జాబితాలో తప్పులున్నాయంటూ దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పాఠశాల విద్యాశాఖ అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

Published : 01 Oct 2022 05:53 IST

తొమ్మిది నెలలు గడిచినా అంతుచిక్కని ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు, బదిలీల వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 317 జీఓ ఆధారంగా ఉపాధ్యాయులను కొత్త జిల్లాలవారీగా కేటాయించి తొమ్మిది నెలలైనా ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో అంతుచిక్కడం లేదు. సీనియారిటీ జాబితాలో తప్పులున్నాయంటూ దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పాఠశాల విద్యాశాఖ అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అధిక శాతం వ్యాజ్యాలపై విద్యాశాఖే తగిన నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశిస్తోంది. అయితే, కొందరు ఉపాధ్యాయులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా మరో పాయింట్‌పై హైకోర్టు మెట్లు ఎక్కుతుండటంతో విద్యాశాఖ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. ఈ పిటిషన్లన్నింటికీ పరిష్కారం దొరకాలంటే కనీసం మరో అయిదు సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త జిల్లాలు కేటాయించారు. రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 24,500 మంది జిల్లాలు మారారు. వారిలో 12 వేల మంది తమకు అన్యాయం జరిగిందని వివిధ కారణాలు చూపుతూ విద్యాశాఖకు అప్పీళ్లు చేసుకున్నారు. వాటిలో అధిక శాతం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతేకాకుండా రంగారెడ్డి, మేడ్చల్‌, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో స్పౌజ్‌ పోస్టింగులు ఇవ్వరాదని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో 1,150 మందికి పోస్టింగులు ఇచ్చారు.

3 వేల కేసుల పరిష్కారం ఎప్పుడో?

జనవరి నుంచి వేల మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరి అభ్యర్థనలను పరిశీలించి వాస్తవముంటే న్యాయం చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తూ వచ్చింది. ప్రస్తుతం సుమారు 3 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కేసులపై అఫిడవిట్లు దాఖలు చేయాల్సి వస్తోంది. సుమారు 500 కేసుల్లో విద్యాశాఖ కోర్టు ధిక్కరణనూ ఎదుర్కొంది. ఈ శాఖలోని సర్వీస్‌ విభాగం అధికారులు నిత్యం కేసుల పనిలోనే ఉంటున్నారు.

ఆ 3 జిల్లాల్లోనే అధికం

మొత్తం పెండింగ్‌ కేసుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలవే 60 శాతం వరకు ఉన్నాయి. ఇవి పెద్ద జిల్లాలు కావడం, ఉమ్మడి జిల్లాలోని దూర ప్రాంతాలకు కేటాయించడంతో కేసులు ఎక్కువగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా సీనియారిటీ, భార్యాభర్తల కేటగిరీ, వితంతువు, అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదన్న వాటిపైనే కేసులు ఎక్కువగా దాఖలయ్యాయని పేర్కొంటున్నాయి. న్యాయస్థానంలో పోరాడుతున్న వారిలో మహిళా ఉపాధ్యాయులే 2 వేల మంది వరకు ఉన్నారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని నియమించి త్వరగా కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని