వైకల్యమా.. కలత వద్దు

ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులను కోల్పోయిన వారికి ఊరట కలిగిస్తోంది నిమ్స్‌ ఆసుపత్రి. ఇక్కడ అమర్చే కృత్రిమ అవయవాలు బాధితులకు ఊతమిస్తున్నాయి.

Published : 07 Oct 2022 04:54 IST

నిమ్స్‌లో అత్యాధునిక కృత్రిమ పరికరాలు

సహజ అవయవాలకు దీటుగా పనితీరు

ప్రైవేటుతో పోల్చితే అయిదో వంతు ధరకే అందుబాటులో

సీఎం సహాయ నిధి నుంచి ఉచితంగా చికిత్స

అంతర్జాతీయ జర్నల్‌లో  వ్యాసం ప్రచురితం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులను కోల్పోయిన వారికి ఊరట కలిగిస్తోంది నిమ్స్‌ ఆసుపత్రి. ఇక్కడ అమర్చే కృత్రిమ అవయవాలు బాధితులకు ఊతమిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వీటికి రూ.10-15 లక్షల వరకు ఖర్చవుతుండగా.. ప్రభుత్వ వైద్యంలో పేరెన్నికగన్న నిమ్స్‌లో అందులో అయిదో వంతు సొమ్ముతోనే చికిత్స పూర్తవుతోంది. సీఎం సహాయనిధి నుంచైతే నిమ్స్‌లో పూర్తి ఉచితంగా ఈ సేవలందిస్తున్నారు. సహజ అవయవాల పనితీరుకు 90 శాతం దగ్గరగా కృత్రిమ పరికరాలు పనిచేస్తుండడం విశేషం. సర్కారీ వైద్యంలో కృత్రిమ కాళ్లు, చేతులను అందుబాటు ధరల్లోనే అమర్చడంపై హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌కు చెందిన ‘జర్నల్‌ ఆఫ్‌ ఆర్ధోపెడిక్స్‌, ట్రామా అండ్‌ రిహాబిలిటేషన్‌’ తాజా సంచికలో వ్యాసం ప్రచురితమైంది. ఒక ప్రభుత్వ వైద్యసంస్థలో సర్కారు ప్రోద్బలంతో ఈ తరహాలో కృత్రిమ అవయవాలను అమర్చే విధానం ఎక్కడా లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇతర దేశాల్లోనూ దీన్ని అమలు చేయొచ్చని జర్నల్‌ సూచించింది.

అలా మొదలైంది..
2016లో విద్యుదాఘాతంతో రెండు చేతులూ కోల్పోయిన ఓ వ్యక్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిమ్స్‌ వైద్యులు ఎలక్ట్రానిక్‌ చేతులను అమర్చారు. నాటి డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ వాటి తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరపడంతో.. రెండు చేతులకు కలిపి రూ.4.70 లక్షల వ్యయమైంది. ఈ చేతుల్లో వేళ్లు కదులుతాయి. వస్తువును పట్టుకోవచ్చు. నీళ్ల సీసాను ఎత్తి తాగవచ్చు. డ్రైవింగ్‌ కూడా చేయొచ్చు. అనంతర కాలంలో నిమ్స్‌ ఆర్ధోపెడిక్స్‌ వైద్యులు కృత్రిమ అవయవాలపై అధ్యయనం చేసి.. పరిశోధన పత్రాన్ని రూపొందించారు. వారి కృషితో ఒక్కో కృతిమ కాలు, చేయి కేవలం రూ.80 వేలకే ప్రైవేటు కంపెనీల నుంచి అందుబాటులోకి వచ్చాయి. సీఎం సహాయ నిధి ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో బాధితుడికి రూ.10-15 లక్షలు వెచ్చించడం కంటే.. అవే నిధులతో నిమ్స్‌లో 10 మందికి పైగా పరికరాలను అమర్చవచ్చని అంచనా వేశారు. దీన్ని ప్రభుత్వం ముందుంచారు. ఇతర ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆమోదం లభించడంతో 2017 నుంచి నిమ్స్‌లో కృత్రిమ పరికరాల అమరిక చికిత్స అందుబాటులోకి వచ్చింది.

విమానాలు, క్షిపణుల్లో వినియోగించే పదార్థాలతో..
కర్ర, ప్లాస్టిక్‌తో రూపొందే కృత్రిమ అవయవాల ధర తక్కువే అయినా.. వాటి ఉపయోగం నామమాత్రమే. అత్యాధునిక పరికరాలకు విమానాలు, క్షిపణులు, రాకెట్లలో వినియోగించే కార్బన్‌ ఫైబర్‌, టైటానియంలను వినియోగిస్తున్నారు. దీంతో పరికరం తేలిగ్గా ఉంటుంది. ఇంతకుముందు కృత్రిమ కాలు అయిదు కిలోల బరువుంటే ఇది కిలోనే ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత చిప్‌ సాయంతో పనిచేసే ఈ కాలిని ఎలక్ట్రానిక్‌ లింబ్‌ అంటారు. దీని ద్వారా అయిదు వేళ్లూ పనిచేస్తాయి. లోపల ఎలక్ట్రానిక్‌ చిప్‌ ఉంటుంది. దీనికి ముందు, వెనుక రెండు ఎలక్ట్రోడ్స్‌ ఉంటాయి. కాలి కదలికలకు ఇవే తోడ్పడతాయి. మెదడు సంకేతాలను కూడా గ్రహిస్తాయి. ఫలితంగా వేళ్లు ముడుచుకోవడం, మెట్లు ఎక్కడం, దిగడం వంటి పనులు కూడా సహజంగా చేయవచ్చు.

‘ప్రైవేటు’ వ్యయానికి అడ్డుకట్ట
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏటా సీఎం సహాయనిధి ద్వారా సుమారు రెండువేల మందికి కృత్రిమ కాళ్లు, చేతులు అమర్చేవారు. ఇందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చయ్యేది. నిమ్స్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చికిత్స అందుతోంది. ఇక్కడ గత అయిదేళ్లలో 220 మందికి పైగా కృత్రిమ కాళ్లు, చేతులను అమర్చారు. వీరిలో 92 శాతం మంది పురుషులు, 8 శాతం మంది మహిళలు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సలకు ఏడాది వారంటీ ఇస్తుండగా.. నిమ్స్‌లో మూడేళ్ల వారంటీ ఇస్తున్నారు. మూడేళ్లలో ఏ సమస్య ఎదురైనా ఉచితంగా సేవలందిస్తారు. అవసరమైతే కొత్త పరికరాలు అమరుస్తారు. నిమ్స్‌ చికిత్సల వల్ల సీఎం సహాయ నిధి నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లింపులు తగ్గాయి.


అధ్యయనకర్తలు వీరే

నిమ్స్‌ ఆర్ధోపెడిక్స్‌ విభాగం వైద్యులు డాక్టర్‌ చంద్రశేఖర్‌ పట్నాల, డాక్టర్‌ లక్కిరెడ్డి మహేశ్వరరెడ్డి, డాక్టర్‌ నాగేశ్‌ చెరుకూరి, డాక్టర్‌ రాజు అయ్యంగార్‌లు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం అధిపతి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్‌ తాడూరి గంగాధర్‌లు ఈ ప్రాజెక్టు పురోగతిలో కీలకపాత్ర పోషించారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts