Tamilisai Soundararajan: నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారేమో..!

తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానం ఉందని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని గవర్నర్‌ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 10 Nov 2022 06:08 IST

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులోకి నన్నూ లాగే యత్నం
అందుకే నా మాజీ ఏడీసీ తుషార్‌ పేరు తెరపైకి
ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లు తొక్కిపెట్టలేదు
రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌లా కాదు: గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానం ఉందని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని గవర్నర్‌ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలోకి తనను లాగే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో భాగంగానే తన మాజీ ఏడీసీ తుషార్‌ను ఈ కేసులోకి తెచ్చారని ఆరోపించారు. గవర్నర్‌ బుధవారం రాజ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందని, రాజ్‌భవన్‌ ప్రతిష్ఠ తగ్గించాలని చూస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డుపై తాను వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. సీఎంకు రాసిన లేఖ మంత్రికి చేరలేదని చెప్పడాన్నిబట్టి రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అవగతమవుతుందన్నారు. బిల్లులకు ఆమోదం తెలిపే విషయం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని, తనకు దానిపై విస్తృతాధికారాలు ఉన్నాయన్నారు.  ‘నేను బిల్లులు ఆపుతున్నాననే దుష్ప్రచారం జరుగుతోంది. నేను ఎలాంటి బిల్లులు ఆపలేదు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లు సహా మరికొన్ని నా వద్దకు గత సెప్టెంబరులో వచ్చాయి. వాటిని పరిశీలిస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో కొత్త నియామక బోర్డు అవసరం ఏమొచ్చింది? అది యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా? న్యాయపరమైన ఇబ్బందులొస్తే ఏంటి పరిస్థితి.. మళ్లీ నియమాకాలు ఉంటాయా?.. ఇవన్నీ అడిగితే విద్యామంత్రి తనకు సమాచారం రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అర్హులకు మాత్రమే పోస్టులు దక్కాలనేదే నా ఉద్దేశం. అందుకే బిల్లుల ఆమోదానికి కొంత సమయం పడుతోంది. ఎంత సమయమనే కాలపరిమితి లేదు. ఈలోపే విద్యార్థి సంఘాలతో రాజ్‌భవన్‌ ముందు ఆందోళనలకు రెచ్చగొడుతున్నారు. ఎనిమిదేళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోతే ఆందోళన చేయని విద్యార్థి ఐకాస ఒక నెల నా వద్ద ఆగిపోగానే ఎందుకు ధర్నా చేస్తామంటోంది? దీని వెనక ఎవరున్నారు’?

తుషార్‌ శుభాకాంక్షలు చెబితే కేసులో ఇరికించారు

‘ఫాంహౌస్‌ కేసులోకి రాజ్‌భవన్‌ను లాగే ప్రయత్నం చేస్తున్నారు. నా మాజీ ఏడీసీ (భద్రతాధికారి) తుషార్‌ను ఈ కేసులోకి తీసుకురావడానికి కారణం ఇదే. ఆడియో టేప్‌ విషయంలోనూ రాజ్‌భవన్‌ ప్రస్తావన తెచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్‌భవన్‌ పాత్ర ఉందని చెప్పే విధంగా తెరాస అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో పెట్టారు. తుషార్‌ ఫోన్‌ చేసి దీపావళి శుభాకాంక్షలు చెబితే ఆయన పేరును ఈ వ్యవహారంలోకి ఎలా తెస్తారు? నా ఫోన్‌ ట్యాప్‌ చేసుకోండి. భయం లేదు. కావాలంటే నా ఫోన్‌ ఇస్తాను.’

నా ప్రోటోకాల్‌ ఎందుకు పాటించడం లేదు?

‘ప్రధాని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించడానికి వస్తుంటే ప్రోటోకాల్‌ అంటూ రచ్చ చేస్తున్నారు. నేను జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు అధికారులు కనీసం ప్రోటోకాల్‌ పాటించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి.’

మంత్రి అపాయింట్‌మెంట్‌ కోరితే నిర్ణయం తీసుకుంటా

‘మంత్రి సబితారెడ్డి నా అపాయింట్‌మెంట్‌ కోరితే దానిపై నిర్ణయం తీసుకుంటా. రాజ్‌భవన్‌కు చాలామంది వస్తుంటారు. వారిని కూడా కలవాల్సి ఉంది. తమిళనాడులో తెలుగు మూలాల వారి గురించి నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఖైదీల విడుదలలో హోంశాఖ విధానాలను పాటించలేదు. జీవితఖైదు పడిన వారిని విడుదల చేయరాదు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను మెరుగుపరచకుండా ప్రైవేటు యూనివర్సిటీలను పెంచుకుంటూ పోవడం ఎందుకు? విశ్వవిద్యాలయాలకు గవర్నరే ఛాన్సలర్‌గా ఉండాలనేది నా అభిప్రాయం’ అని తమిళిసై తెలిపారు.

గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరాం: విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

విశ్వవిద్యాలయాల నియామక బోర్డుపై గవర్నర్‌ తమిళిసై సందేహాలను నివృత్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె తమ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఉమ్మడి నియామకాల బోర్డుపై గవర్నర్‌ సీఎం కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖ ఈ రోజు నాకు అందింది. దీనిపై చర్చించేందుకు గవర్నర్‌  అపాయింట్‌మెంట్‌ కోరాం. ఆమె సమయం ఇచ్చిన వెంటనే వెళ్లి కలుస్తాం’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని