బతికేందుకు...‘స్లాట్‌’ ఇస్తారా?

ఆ ఇద్దరు పిల్లలూ జీవచ్ఛవాలే. ఎవరైనా సాయం చేస్తేనే ఒక అడుగు వేయగలుగుతారు. ఒక ముద్ద తినగలుగుతారు. పుట్టినప్పటి నుంచే తీవ్రమైన రుగ్మతతో నరకం అనుభవిస్తున్నారు.

Updated : 05 Dec 2022 07:07 IST

జీవచ్ఛవాలుగా మారిన పిల్లలకు అందని ఆసరా  
రెండేళ్లుగా సదరం రెన్యువల్‌కు స్లాట్‌ దొరకని దుస్థితి
తీవ్ర మనోవేదనలో నిరుపేద తల్లిదండ్రులు

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, కల్హేర్‌: ఆ ఇద్దరు పిల్లలూ జీవచ్ఛవాలే. ఎవరైనా సాయం చేస్తేనే ఒక అడుగు వేయగలుగుతారు. ఒక ముద్ద తినగలుగుతారు. పుట్టినప్పటి నుంచే తీవ్రమైన రుగ్మతతో నరకం అనుభవిస్తున్నారు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండిపోతారు. కనీసం ఎన్నిరోజులు బతుకుతారనే విషయమూ చెప్పలేమని వైద్యులు తెలిపారు. అలాంటి పిల్లల పోషణ కోసం నిరుపేద దంపతులు అల్లాడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రామిరెడ్డిపేటకు చెందిన జి.దుర్గయ్య, లక్ష్మి ఇంట్లో పరిస్థితి ఇది...  చేపలు పట్టి జీవనం సాగించే దుర్గయ్య, లక్ష్మిల ఇద్దరు కుమారులు పోచయ్య (10), మల్లేశం (8) పుట్టినప్పటి నుంచే కండరాల క్షీణతతో బాధపడుతున్నారు. 2015లో సదరం ధ్రువపత్రం రావడంతో అప్పటి నుంచి వీరికి పింఛను ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పత్రం చెల్లుబాటు అయిదేళ్లు. కాలపరిమితి ముగియడంతో రెండేళ్ల క్రితం పింఛను నిలిచిపోయింది. మళ్లీ మీసేవలో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. దాని ఆధారంగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చి సదరం రెన్యూవల్‌ చేయించాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే తిరిగి వారికి పింఛను అందుతుంది. ప్రతినెలా స్లాట్‌ నమోదుకు నడవలేని బిడ్డలను మోసుకొని దంపతులిద్దరూ మీసేవ కేంద్రానికి వెళ్లడం, స్లాట్‌ దొరక్క నిరాశగా ఇంటిముఖం పట్టాల్సిరావడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక్కో నెల ఒక్కో తేదీన స్లాట్‌ నమోదుకు అవకాశం ఇస్తుండడంతో తమకు ఆ సమాచారం కూడా అందడం లేదని దుర్గయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వ్యయప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లినా తమ వంతు రావడం లేదన్నారు. ఈ దంపతులకు పోచయ్య, మల్లేశంతో పాటు భవాని (5) అనే అమ్మాయి, మూడేళ్ల వయసున్న బాబు శివకుమార్‌ ఉన్నారు. శివకుమార్‌ కూడా ఇదే వ్యాధి బారినపడడంతో వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. కనీసం పోచయ్య, మల్లేశం ఇద్దరికీ ‘ఆసరా’ అందినా తమకు గొప్ప ఊరట దక్కుతుందని ఆవేదనగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని