అడవికి అనర్హుల ‘పోడు’

అటవీ భూములపై హక్కులకు అనర్హులు అర్హులమంటూ ప్రయత్నాలు చేస్తున్నవారు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్నారు.

Published : 10 Dec 2022 05:57 IST

అటవీ భూములపై హక్కులకు అర్హతలేని వారి ప్రయత్నాలు

ఇందులో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఛోటామోటా నేతలు

పోడు పట్టాల కోసం అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ భూములపై హక్కులకు అనర్హులు అర్హులమంటూ ప్రయత్నాలు చేస్తున్నవారు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్నారు. పలువురు ఉద్యోగులు, స్థానిక, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ఛోటామోటా రాజకీయ నాయకులు అటవీ భూములపై కన్నేశారు. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం ఫలానా ఫలానా దరఖాస్తులకు అభ్యంతరాలు చెప్పొద్దంటూ అటవీ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. అటవీహక్కుల చట్టం-2006 ప్రకారం గిరిజనులు 2005 డిసెంబరు 13వ తేదీ నాటికి అటవీ భూముల్లో సాగులో ఉండాలి. గిరిజనేతరులు అయితే మూడు తరాలుగా అటవీ భూముల్లో పోడు చేస్తుండాలి. వచ్చిన దరఖాస్తుల్లో 50-60శాతం  బోగస్‌వేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2005కి ముందా? తర్వాత కాదు..అసలు వారి కబ్జాలో అటవీ భూమే లేదు అని పేర్కొంటున్నారు.

అర్హులు 5 శాతం లోపే?

రాష్ట్రవ్యాప్తంగా 12,46,846 ఎకరాలకు అటవీ భూమిపై హక్కు పత్రాల కోసం 4,14,353 లక్షల అర్జీలు అందాయి. గ్రామ, సబ్డివిజన్‌ స్థాయిలో పరిశీలన పూర్తయింది. జిల్లా స్థాయిలో తుది పరిశీలన జరగాలి. రెండు దశల్లో పరిశీలనను బట్టి 5శాతమే అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హమైనవిగా ఉంటాయని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ని లక్షల దరఖాస్తులకు కారణం.. పోడు పట్టాలు వస్తాయేమోనన్న ఆశ. ఇప్పుడు కాకున్నా దరఖాస్తు ఆధారంతో భవిష్యత్తులో వస్తుందన్న ఆశతో ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

ఆయనో మాజీ పోలీసు.. కొడుకు, కోడలు ఐటీ ఉద్యోగులు

ఆయనో మాజీ పోలీసు. వికారాబాద్‌ జిల్లాలో ఆ భార్యాభర్తలకు ఇప్పటికే భూములున్నాయి. కొడుకు పేరు మీద రెండు, కోడలు పేరుతో మూడు ఎకరాల అటవీభూమిలో పోడు సాగుచేస్తున్నట్లు దరఖాస్తు చేశారు. కోడలు పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. పుట్టింటి విషయం పరిగణనలోకి తీసుకున్నా 2005 నాటికి ఆమె మైనర్‌. కొడుకు, కోడలు ఇద్దరు ఐటీ ఉద్యోగులు.

సిరిసిల్లలో బంధువుల పేరిట ప్రజాప్రతినిధులు..

సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు బంధువుల పేరిట అటవీ భూములను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ ఎంపీపీ తన అత్త పేరుతో రెండు ఎకరాలకు, ఓ జడ్పీటీసీ మెంబరు ఎకరాకు దరఖాస్తు చేశారు. ఓ మండలంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడూ అర్జీ పెట్టాడు. అదే మండలానికి ఓ ప్రధాన పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి కూడా దరఖాస్తు చేశాడు. వీరు గిరిజనులు కాదు. ఆ మండలంలో దాదాపు 80శాతం అటవీ ప్రాంతమే. దీంతో సర్పంచులు, వార్డు సభ్యులు పలువురు అటవీ భూములను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే మండలంలో ఓ కానిస్టేబుల్‌ తండ్రి దరఖాస్తు అర్హుల జాబితాలో చేరింది.

మహబూబాబాద్‌లో ఉద్యోగులు, నాయకులు..

పోడు దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన జిల్లాల్లో మహబూబాబాద్‌ ఒకటి. కొత్తగూడ రేంజ్‌ పరిధిలోని పలు గ్రామాల నుంచి ఆరుగురు ఉద్యోగులు కుటుంబ సభ్యుల పేరిట దరఖాస్తు చేశారు. వాటిని తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే రేంజ్‌లో ఓ మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడి పేరుతో ఆరు ఎకరాలకు దరఖాస్తు చేయించాడు. గూడూరు రేంజ్‌లో మచ్చర్ల, ఏపూరు, బ్రాహ్మణపల్లి గ్రామాల నుంచి నలుగురు ఉద్యోగుల కుటుంబ సభ్యులు అర్జీలు పెట్టారు. ఇదే రేంజ్‌లోని సరస్వతినగర్‌ బీట్‌ పరిధిలో 1029, 1030 కంపార్ట్‌మెంట్లో 9 ఎకరాల భూమికి ఓ మాజీ ప్రజాప్రతినిధి తన కుటుంబ సభ్యుల పేరుతో దరఖాస్తు చేశాడు. సర్వే సమయంలో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు తిరస్కరించినట్లు సమచారం.

ములుగులో ఆ గట్టు, ఈ గట్టు.. ఏ గట్టూ లేదు

ములుగు జిల్లాలో 94,002 ఎకరాల అటవీభూమికి హక్కుల కోసం 34,082 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో దాదాపు సుమారు 51-56 వేల ఎకరాల్లో ఎలాంటి సాగు జరగట్లేదని అటవీశాఖ గుర్తించినట్లు సమాచారం. సాగు చేస్తుంటే.. ఆ భూమికి అటు పక్క గట్టు, ఇటుపక్క గట్టు ఉంటాయి. ఈ భూముల్లో ఏ గట్టూ లేదని అటవీశాఖ గుర్తించింది. గ్రామం పేరుతో, అడవిలో భూమి ఉందంటూ దరఖాస్తుదారులు క్లెయిమ్‌ చేస్తున్నారు.

జయశంకర్‌ జిల్లా మహాముత్తారం మండలంలో 6,780 దరఖాస్తులు రాగా, అందులో 227 మాత్రమే అర్హత పొందాయి. రెండు గ్రామాలను పరిశీలిస్తే- ఓ రాజకీయ పార్టీకి చెందిన ఆరుగురు నాయకులు కుటుంబసభ్యులు, బినామీల పేర దరాఖాస్తు చేసి పత్రాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదే జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఓ గ్రామ ప్రజాప్రతినిధి స్థానికంగా ఐదు ఎకరాల అటవీస్థలాన్ని చూపించి తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల పేరుతో అటవీ హక్కు పత్రాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాగూ లేదు.

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో ఓ జాతీయ పార్టీ నాయకుడు తన భార్య పేరుతో దాదాపు మూడు ఎకరాల అటవీ భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేశాడు. కొడంగల్‌, అప్పాయిపల్లిలో ఇద్దరు పాత్రికేయులు రెండు, మూడు ఎకరాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు చోట్ల క్షీణించిన అటవీప్రాంతాన్ని దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లాలోనే ఓ ఎమ్మెల్యే దాదాపు డజను దరఖాస్తులకు పచ్చజెండా ఊపాలంటూ అటవీ అధికారులను కోరుతున్నారు. సుమారు 30 ఎకరాల అటవీ ప్రాంతం అది. నిజానికి ఆ అర్జీలన్నీ అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని