‘పీడీ’ పిడికిట.. డ్రగ్‌ స్మగ్లర్లు!

రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం పెరగడాన్ని పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. నార్కోటిక్‌ డ్రగ్స్‌ సరఫరాదారుల్ని కటకటాల్లోకి పంపడం ద్వారానే మాదకద్రవ్యాల్ని సమూలంగా నియంత్రించొచ్చని పోలీసులు యోచిస్తున్నారు.

Published : 28 Jan 2023 05:31 IST

మూడేళ్లలో 416 మందిపై ప్రయోగం
7,498 మంది గంజాయి సరఫరాదారుల అరెస్ట్‌
నియంత్రణపై పోలీసులకు డీజీపీ అంజనీకుమార్‌ దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం పెరగడాన్ని పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. నార్కోటిక్‌ డ్రగ్స్‌ సరఫరాదారుల్ని కటకటాల్లోకి పంపడం ద్వారానే మాదకద్రవ్యాల్ని సమూలంగా నియంత్రించొచ్చని పోలీసులు యోచిస్తున్నారు. డ్రగ్స్‌ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఇందులోభాగంగా రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 416 మంది డ్రగ్‌ స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు క్రమంలో దాన్ని తెలంగాణలోనూ డంప్‌ చేస్తున్నారని పలుమార్లు తేలింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు కల రహదారులు, రవాణా మార్గాలపై నిఘా తీవ్రతరం చేశారు. డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాలను గుర్తించి అణిచివేసేందుకు గాను సీఐడీ నేతృత్వంలోని యాంటీ నార్కోటిక్స్‌ విభాగం కార్యాచరణను రూపొందిస్తోంది.

మూడేళ్లలో పెరుగుదల

తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు సంబంధించి మొత్తం 4,332 కేసులు నమోదయ్యాయి.

అందులో గడిచిన మూడేళ్లలోనే 3,133 నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మూడేళ్ల వ్యవధిలోనే మాదకద్రవ్యాల వినియోగం తీవ్రంగా పెరిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మూడేళ్లలో పోలీసు యంత్రాంగం 89,900 కిలోల గంజాయి, 711 కిలోల ఇతర మాదకద్రవ్యాల్ని జప్తు చేసింది. డ్రగ్స్‌ సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించడంలో రాచకొండ పోలీసులు రాష్ట్రంలోనే ముందున్నారు. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 95 మందిపై ఈ చట్టం ప్రయోగించారు.

నియంత్రణకు శాస్త్రీయ దర్యాప్తు: డీజీపీ అంజనీకుమార్‌

రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసు యంత్రాంగానికి డీజీపీ అంజనీకుమార్‌ దిశానిర్దేశం చేశారు. వాటి నిర్మూలనకు శాస్త్రీయ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెన్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం అమలుపై శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది 1278 మందిపై ఈ చట్టం కింద కేసులు నమోదయ్యాయన్నారు. తెలంగాణ మాదకద్రవ్యాలు సరఫరాచేసే మూలం కాదని.. కేవలం గమ్యస్థానమేనని సీఐడీ అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తు తీరుతెన్నులను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రంగదాన్‌, మాదకద్రవ్యాల జప్తు విధానాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌ క్లూస్‌ టీం డైరెక్టర్‌ డా.వెంకన్న వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని