త్రిసూత్రం.. మా విజయ రహస్యం: రాష్ట్రపతి భవన్‌లో నెల్లుట్ల సర్పంచి ప్రసంగం

నీటి సమృద్ధిలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారంలో జాతీయస్థాయి ప్రథమ అవార్డు అందుకున్న జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల సర్పంచి చిట్ల స్వరూపారాణి గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగించారు.

Updated : 21 Apr 2023 07:59 IST

లింగాలఘనపురం, న్యూస్‌టుడే: నీటి సమృద్ధిలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారంలో జాతీయస్థాయి ప్రథమ అవార్డు అందుకున్న జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల సర్పంచి చిట్ల స్వరూపారాణి గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగించారు. గ్రామాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమకూరిన నిధులు, విరాళాల సేకరణ తదితరాలను వివరించిన తీరు  ఆకట్టుకుంది.

‘‘నా పేరు చిట్ల స్వరూపారాణి. నేను నెల్లుట్ల సర్పంచిని. నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగించడం, రీఛార్జ్‌ చేయడం... అనే మూడు సూత్రాలే మా ఊరి ప్రగతి మంత్రం. మా గ్రామంలో ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ కుళాయిల ద్వారా నీటిని అందిస్తున్నాం. ‘పల్లెప్రగతి’లో భాగంగా 17 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటాం. ఉపాధి హామీలో చేపట్టిన ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, ఫాంపాండ్లతో భూగర్భ జలమట్టం పెరిగింది. మురుగునీటి నిర్వహణకు 745 మ్యాజిక్‌, కమ్యూనిటీ సోక్‌ఫిట్లు నిర్మించాం. వాననీటి సంరక్షణకూ ఏర్పాటు చేసుకున్నాం. మురుగు కాల్వల చివర్లో ఇంకుడు గుంతలను నిర్మించి దోమల బెడదను, కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని తగ్గించాం. ప్రతి శుక్రవారం తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేషన్‌లతోపాటు నాణ్యత పరీక్షలను చేస్తున్నాం. వీటన్నింటి నిర్వహణకు ప్రజలకు చైతన్యం చేశాం. ఈ కార్యక్రమాలే నీటి సమృద్ధిని సాధించడానికి దోహదపడ్డాయి. మా పంచాయతీని జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిపాయి’ అని స్వరూపారాణి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని