KTR: అభివృద్ధిలో అన్‌స్టాపబుల్‌

‘తెలంగాణ, హైదరాబాద్‌ల అభివృద్ధి అన్‌స్టాపబుల్‌. దీనిని మోదీ, షా ఎవరూ ఆపలేరు. ప్రగతి రథచక్రం ఆగదు. ఎవరైనా అడ్డువస్తే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ ముందుకు పోవడమే’ అని భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.

Updated : 25 Apr 2023 09:29 IST

మోదీ, షాలే కాదు.. తెలంగాణ ప్రగతి రథచక్రాన్ని ఎవరూ ఆపలేరు
కేసీఆర్‌ నీడను కూడా చేరుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో లేదు
హ్యాట్రిక్‌ విజయం ఖాయం
రెండో స్థానంలో కాంగ్రెస్‌
భాజపా.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘తెలంగాణ, హైదరాబాద్‌ల అభివృద్ధి అన్‌స్టాపబుల్‌. దీనిని మోదీ, షా ఎవరూ ఆపలేరు. ప్రగతి రథచక్రం ఆగదు. ఎవరైనా అడ్డువస్తే జగన్నాథ రథచక్రాల్లా తొక్కుకుంటూ ముందుకు పోవడమే’ అని భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్‌ నాయకత్వంలో భారాస అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని, అయితే అది కూడా రెండోస్థానంలో.. చాలా దూరంలో ఉందన్నారు. భాజపా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ అని అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న భారాస ప్లీనరీ నేపథ్యంలో ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

అమిత్‌షా మొదలుకొని భాజపా కేంద్ర నాయకులు కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కదా?

ఎక్కడ ప్రతిపక్ష ప్రభుత్వముంటే.. అక్కడికి వెళ్లి ఇది అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపణలు చేస్తుంటారు. మేఘాలయలో కాన్రాడ్‌ సంగ్మాతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఎన్నికలు వచ్చి బయటకు రాగానే. అత్యంత అవినీతి సీఎం కాన్రాడ్‌ సంగ్మా అంటూ ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వారం తిరగకుండానే మళ్లీ ఆయన ప్రభుత్వంలోనే భాజపా చేరింది. ప్రమాణ స్వీకారానికి మోదీ, అమిత్‌షా కూడా హాజరయ్యారు. ఇదీ వాళ్ల వ్యవహారం. కర్ణాటకలో 40 శాతం కమీషన్‌ ప్రభుత్వమని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. 40 శాతం కమీషన్‌ అడుగుతున్నారని కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈశ్వరప్ప అనే మంత్రి బర్తరఫ్‌ అయ్యారు. ప్రైవేటు పాఠశాలల వాళ్లు ఉత్తరాలు రాశారు. ఆఖరికి  రూ.2,500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అధినాయకత్వం చెప్పిందని కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత భాజపా ఎమ్మెల్యే ఆరోపించారు. వీటిలో దేనిపైనా స్పందన ఉండదు. సీబీఐ ఉండదు. ఈడీ ఉండదు.

మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏయే అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు?

అన్నం ఉడికిందా? లేదా? అని చూడ్డానికి ఒక మెతుకు ముడితే చాలు. మూడుశాతం కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం దేశంలో 30 శాతం పంచాయతీ అవార్డులు గెలుచుకుంది. ఇంతకుమించి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఏముంటుంది? ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చి విమర్శలు చేస్తే.. నేను ఒకటే అడిగా.. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం పెరిగిన రాష్ట్రం తెలంగాణ... దేశంలో అత్యధిక పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అవార్డులు వస్తున్నది కూడా తెలంగాణకే. ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు సృష్టిస్తున్నది ఇక్కడేనని నాస్కామ్‌ చెబుతోంది. అత్యధిక పచ్చదనం పెంచింది కూడా తెలంగాణనే. ఇంటింటికీ నీరిచ్చిన రాష్ట్రం తెలంగాణనే. ఇలా చెప్పుకొంటూ పోతే 17 రంగాలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది ఇక్కడే. అత్యంత తక్కువ అవినీతి ఉన్నది తెలంగాణలోనేనని సీఎస్‌డీఎస్‌ లోక్‌మత్‌ వాళ్లు చేసిన సర్వేలో వెల్లడైంది. ఇలా ఒక సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం నమూనాగా కనిపిస్తోంది. ఇంతకంటే మెరుగైన పరిపాలన ఏ రాష్ట్రంలోనైనా ఉంటే చెప్పండని ప్రధానిని కోరితే ఇంతవరకూ సమాధానం లేదు. అమిత్‌షాను కూడా అడిగా. ‘రాష్ట్రానికి వచ్చారంటే మమ్మల్ని తిడుతున్నారు కదా? మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే మెరుగైన నమూనా ఉందా? అంటే జవాబు లేదు.. కేంద్ర ప్రభుత్వానికి మేమంటే దయ, ఇష్టం లేకపోయినా.. అనివార్యంగా అవార్డులు ఇచ్చే పరిస్థితులు కల్పించాం. 9 ఏళ్ల మా ప్రభుత్వం పనితీరు, దానికి ప్రజలిచ్చిన మెచ్చుకోలు, అన్నీ ప్రజల ముందు పెడతాం. వీటి ప్రాతిపదికన మళ్లీ మాకే ఓటు వేయాలని అడుగుతాం. కేంద్రం ఏవిధంగా విఫలమైందో కూడా వివరిస్తాం. ఈ నెల 27న భారాస ప్లీనరీలోనూ నిత్యావసర ధరల పెరుగుదల, అదానీ రూపంలో తారస్థాయికి చేరుకున్న అవినీతి తదితర అంశాలను చర్చకు పెడతాం.

ఇప్పటివరకు జరిగినవి కాకుండా కొత్తగా చేపట్టాల్సినవి ఏమున్నాయి?

ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా చాలా మెరుగుపరచాల్సి ఉంది.. మెట్రో రెండోదశ, ఎయిర్‌పోర్టు మెట్రో.. రెండూ పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాం. హైదరాబాద్‌ మెట్రోను 250 కి.మీ. విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఆర్టీసీలో మొత్తం విద్యుత్‌ బస్సులనే ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇంకా పెద్ద ఎజెండా సీఎం కేసీఆర్‌ వద్ద ఉంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు సదుపాయాలను ప్రజలకు కల్పించడంతో పాటు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించుకున్నాం. సచివాలయాన్ని కూడా అత్యద్భుతంగా నిర్మించాం. భారత్‌లో ఒక లక్ష జనాభాకు అత్యధిక ఆసుపత్రి పడకలు కలిగిన రాష్ట్రం తెలంగాణ. కేరళ, తమిళనాడులతో వైద్యరంగంలో పోటీపడుతూ దూసుకెళ్తోంది. విద్య, వైద్యంలో అద్భుతాలు సృష్టిస్తూ.. సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందిస్తూ.. అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఎవరు వదులుకుంటారు? అన్ని వర్గాల వారికి తెలంగాణ ప్రభుత్వం మంచి చేసిందే తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల, దక్షత కలిగిన నాయకుడి వల్ల ప్రజల సంపద పెరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదలకు లబ్ధి చేకూరుతోంది. అందువల్ల ప్రజల ఆశీర్వాదం 100 శాతం మాకే ఉంటుంది.

భారాస ఆత్మీయ సమ్మేళనాలు వరుసగా నిర్వహిస్తున్నారు కదా! క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పందన లభిస్తోంది?

సమ్మేళనాలకు మంచి స్పందన వస్తోంది. సమావేశాలు సభల్లా జరుగుతున్నాయి. ఇన్నేళ్ల పాలన తర్వాత ప్రజల మద్దతు ఇంత ఉండటమనేది ఏ పార్టీకైనా అసాధారణం. అన్ని వర్గాల్లో ఉన్న మద్దతుతో కేసీఆర్‌ కచ్చితంగా హ్యాట్రిక్‌ కొడతారు. ఎందుకంటే కేసీఆర్‌ స్థాయికి కాదు కదా.. ఆయన నీడను కూడా చేరుకునే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేదు. కేసీఆర్‌ లాంటి సమర్థుడెనౖ, బలమైన, దక్షత కలిగిన నాయకుడు ఉంటేనే.. రాష్ట్రం  పురోగమన దిశగా ముందుకు సాగుతుంది. లేకపోతే అన్ని వర్గాలకూ నష్టం జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం.. పనికిమాలిన అంశాలపై చర్చ. హలాల,్   హిజాబ్‌.. మతం పేరిట మంటలుపెట్టి, పచ్చగా ఉన్న రాష్ట్రాల్లో  కూడా చిచ్చుపెట్టే  ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక లాంటి మంచి రాష్ట్రాన్ని కూడా నాశనం చేశారు. నిత్యావసర ధరలు నియంత్రించాలని, ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలని, శాంతిసామరస్యంతో కూడిన వాతావరణం ఉండాలని, భద్రమైన బతుకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా నరేంద్రమోదీ పాలనలో, భాజపా పాలిత రాష్ట్రాల్లో జరగలేదు.. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామన్నారు మోదీ. ఒక్క రైతు ఆదాయమన్నా పెరిగిందా? ఒకే ఒక్క అదానీ ఆదాయం తప్ప మరెవరి ఆదాయమూ పెరగలేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో 603వ స్థానంలో ఉన్న అదానీ 3వ స్థానానికి ఎగబాకారు. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. జాతీయవాదాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని చేసే రాజకీయం దీర్ఘకాలం మన్నదు. తప్పనిసరిగా దేశంలో మార్పు వస్తుంది.

గత రెండేళ్లుగా దర్యాప్తు సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా నిరంతరం దాడులు చేస్తున్నాయి. పర్యవసానాలు ఏమిటి?

దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేయాల్సిందే. కానీ భాజపాపై ఎవరు మాట్లాడితే వాళ్లపై దాడి జరుగుతోంది. ఆఖరికి బీబీసీ ఛానల్‌ మాట్లాడితే వారిపై దాడి, మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అనే పెద్దాయన మాట్లాడితే సీబీఐ నోటీసు.. ఏంటిది? అదానీపై హిండెన్‌బర్గ్‌ రిపోర్టు ఇస్తే మాత్రం దానిపై మాట ఉండదు. ప్రధాని మోదీ ఒత్తిడి చేసి, అదానీకి తమ కాంట్రాక్టులు ఇప్పించారని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం చెప్పింది. దానిపై ప్రధాని మాట్లాడరు. పైగా అత్యంత నీతిమంతుడినని ఆయనకాయనే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారు. 9 ఏళ్లలో ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు ఒక్క భాజపా నాయకుడిపైనైనా దాడి చేసిన దాఖలాలున్నాయా? వీరంతా సత్యహరిశ్చంద్రుడి కజిన్‌ బ్రదర్స్‌..దేశంలో ఇతరులంతా అవినీతిపరులు, దుర్మార్గులా? భయోత్పాతమైన ఒక వాతావరణాన్ని సృష్టించి, వ్యాపారవేత్తలను, సంస్థలను వేధించి, అదానీ వంటి ఒక్కడికి కొమ్ముకాసి, దేశమంతా దివాలా తీయించే రోజు వచ్చింది. దీనివల్ల వ్యాపార వాణిజ్య వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి, అసహనం ఉన్నాయి. పాపం పండినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి.

వచ్చే ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ భాజపాతోనా? కాంగ్రెస్‌తోనా?

నాకు తెలిసి ఈ రోజుకైతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్సే రెండో స్థానంలో ఉంది. అది కూడా సుదూరంగా ఉంది తప్ప దగ్గరగా కాదు. భాజపా అంతా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ. పైపైన బిల్డప్‌ తప్ప ఏమీ లేదు. కాంగ్రెస్‌ కూడా ఆ పార్టీ అధ్యక్షుడి వ్యవహారం వల్ల నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదు. నేను ఐపీఎస్‌ను, మిగిలిన వాళ్లు హోంగార్డులని అధ్యక్షుడే అన్నారు. అలాంటి చోట సీనియర్లు ఉండటం దురదృష్టకరం. గతంలో ఆ పార్టీకి 19 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి కూడా రావు.

విపక్షాలు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి కదా, ఏమంటారు?

తొమ్మిదేళ్లుగా దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ఉసిగొల్పుతున్నారు. మాపైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఆధారాలు చూపెట్టండి. అరెస్టు చేయండి, వద్దన్నామా? మీ లాగా మేం స్టేలు తెచ్చుకోవడం లేదు కదా? బి.ఎల్‌.సంతోష్‌ అనే ఆయన బ్రోకర్‌ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒక లెజిస్లేటర్‌ను కొనడానికి వచ్చి దొరికిపోయారు. విచారణకు రమ్మంటే రానంటాడు, స్టే తెచ్చుకొని ఇంట్లో దాక్కున్నాడు. ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పేపర్‌ లీకేజీలో దొరికిపోయారు. కోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకొని బయటికొచ్చి స్వాతంత్య్ర సమరయోధుడిలా పోజులు కొడతారు. మాపైన దాడులు చేస్తే మేం విచారణకు హాజరవుతున్నాం కదా? ధైర్యం, తెగువ ఉంటే ముందుకు రండి. మేం చట్టాన్ని గౌరవిస్తాం తప్ప అధికారాన్ని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తప్పించుకోం. వారి మాటల్లో విషయం ఉండదు. గుజరాత్‌లో ఎనిమిదేళ్లలో 13 సార్లు పేపర్‌ లీక్‌ అయ్యింది. ఏంచేశారు? ఒక మంత్రి కూడా రాజీనామా చేయలేదు. ఒక నిరుద్యోగికి పైసా సాయం చేయలేదు. ఇక్కడేమో విచారణ జరిపి, అరెస్టులు చేసి అన్ని చర్యలు తీసుకొన్నాం. ఇక్కడ సిట్‌ వద్దు సిట్టింగ్‌ జడ్జితో విచారణ అంటారు. యూపీలో మీడియా ముందు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరిని కాల్చి చంపితే సిట్‌తో విచారణకు ఆదేశించారు. అక్కడైతే సిట్‌ ఒకే. ఇక్కడ మాత్రం కాదు. ఈ  ద్వంద్వ ప్రమాణాలేంటి? దేశం చూస్తోంది. అంత అమాయకంగా లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు.  భాజపా మాకన్నా గొప్ప పార్టీ అయితే మా కంటే మెరుగైన పరిపాలన ఎక్కడ చేశారో చెప్పండి. కేసీఆర్‌ కంటే గొప్పగా పరిపాలిస్తున్న నాయకులను చూపించండి. తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే కేసీఆర్‌ కంటే మంచి పనులు చేయండి.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగులకు మీరేం చెబుతారు?

ప్రభుత్వ నిర్వహణలో అప్పుడప్పుడూ అక్కడక్కడా పొరపాట్లు జరుగుతాయి. దురదృష్టకరం. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరమైనా బాధపడతాం. ఆ విషయంలో నష్టనివారణ చర్యలు తీసుకున్నాం, తీసుకొంటాం. దీన్ని ఎవరో వెలుగులోకి తేలేదు. హాట్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌ ఆధారంగా విచారణకు ఆదేశించి ప్రభుత్వమే చర్యలు తీసుకొంది. తప్పు జరిగిందని కనిపెట్టి ఆ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వమే. మళ్లీ వాటిని చక్కదిద్ది సరైనరీతిలో పరీక్షలను నిర్వహిస్తున్నది కూడా మేమే. తేదీలను కూడా ప్రకటించాం. పరీక్షల నిర్వహణకు కంట్రోలర్‌ను నియమించాం. పిల్లలకు కొంత ఇబ్బంది తలెత్తింది. అసహనం వ్యక్తమవుతోంది. కొంత సమయం వృథా అవుతుంది. కాదనడం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించాలి. ఈసారి తప్పులు జరగకుండా, నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం. ప్రతిపక్షాల వ్యవహారాన్ని కూడా ప్రజలు గమనించాలి. లీకేజీ వ్యవహారాల్లో దొరికింది భాజపా కార్యకర్తలే. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయగానే లీకేజీలు ఆగిపోయాయి. వెనుక ఏం జరుగుతుందనేది నిరుద్యోగులు, యువత ఆలోచించాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా 2.25 లక్షల  నియామకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తప్పైతే.. భాజపా, కాంగ్రెస్‌లను నిరూపించమనండి. మోదీ హామీ ఇచ్చినట్లు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. దేశంలో 18 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా? వచ్చి ఉంటే.. రాష్ట్రంలో నిరుద్యోగ మార్చ్‌ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మా చిత్తశుద్ధిని శంకించొద్దు. పరీక్షలకు చక్కగా సన్నద్ధమై, మంచి మార్కులు సాధించి పారదర్శకంగా జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని