నేటి నుంచి 500 అదనపు స్లాట్లు.. తగ్గనున్న పాస్‌పోర్టు కష్టాలు

పైచదువులు, ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. కరోనా సమయంలో విదేశీయానాలు రద్దవ్వడంతో కొత్తగా పాస్‌పోర్టులను ఎవరూ తీసుకోలేదు.

Updated : 27 Apr 2023 04:26 IST

ఇకపై ప్రతి శనివారమూ పనిదినమే

ఈనాడు, హైదరాబాద్‌: పైచదువులు, ఉద్యోగావకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో పాస్‌పోర్టు కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. కరోనా సమయంలో విదేశీయానాలు రద్దవ్వడంతో కొత్తగా పాస్‌పోర్టులను ఎవరూ తీసుకోలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్లాట్‌ బుక్‌ చేస్తే 40-50 రోజుల వరకు అపాయింట్‌మెంట్‌ దొరకని పరిస్థితి నెలకొనడంలో రద్దీని తగ్గించే మార్గాలపై విదేశాంగశాఖ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రతి శనివారం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్‌కే) పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పీఎస్‌కేలు ఒక నెలలో 22 రోజులే పని చేసేవి. తాజా ఆదేశాలతో 26 రోజులు పనిచేస్తాయి. దీంతోపాటు ప్రతిరోజూ మంజూరు చేస్తున్న పాస్‌పోర్టుల సంఖ్యను కూడా పెంచింది. ఇదివరకు రోజుకు 3,700 స్లాట్‌లు ప్రాసెస్‌ చేసేవారు. వీటికి మరో 500 స్లాట్లను అదనంగా జోడించింది. సంబంధిత వివరాలను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. గురువారం నుంచి మే 10 వరకు అదనపు స్లాట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ లెక్కన రెండు వారాల్లో మొత్తం 58,800 మందికి పాస్‌పోర్టులు మంజూరవనున్నాయి. అంటే ఏడు వేల మంది అదనంగా లబ్ధి పొందనున్నారు.

నేటి నుంచే అపాయింట్‌మెంట్ల మంజూరు

29వ తేదీకి సంబంధించిన అపాయింట్‌మెంట్లు గురువారం (27 ఏప్రిల్‌) సాయంత్రం 4 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌకి పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు కరీంనగర్‌, నిజామాబాద్‌ కేంద్రాలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటాయన్నారు. బేగంపేట్‌లో అత్యధికంగా 800, టోలీచౌకిలో 700, అమీర్‌పేటలో 620, నిజామాబాద్‌లో 320, మిగిలిన పీఎస్‌కేల్లో పదుల సంఖ్యలో స్లాట్లు మంజూరవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు