NMC Chairman: వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం

వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ బి.ఎన్‌.గంగాధర్‌ తెలిపారు.

Updated : 17 May 2024 05:26 IST

అద్దె రోగులు.. ఘోస్ట్‌ ఫ్యాకల్టీకి ముగింపు
ప్రత్యక్షంగా తనిఖీలు చేశాకే కొత్త కళాశాలలకు అనుమతి
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
ర్యాగింగ్‌ నివారణకు కఠిన చర్యలు
పీజీ మెడికల్‌ సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి
‘ఈనాడు’తో ఎన్‌ఎంసీ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.ఎన్‌.గంగాధర్‌  
ఈనాడు - హైదరాబాద్‌

వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌ డాక్టర్‌ బి.ఎన్‌.గంగాధర్‌ తెలిపారు. వైద్య కళాశాలల్లో ఫేక్‌ పేషెంట్లు.. ఘోస్ట్‌ ఫ్యాకల్టీలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు ప్రాధాన్యం ఇస్తూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. కొత్త వైద్య కళాశాలలు 50 మంది విద్యార్థులతో ప్రారంభమయ్యేలా నిబంధనలు మార్చామని.. 220 పడకల బోధనాసుపత్రి ఉంటేనే కళాశాల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సమయానికే ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందే ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆధార్‌ ఆధారంగా బోధన సిబ్బంది హాజరు నమోదు చేయడం సత్ఫలితాలిస్తోందని చెప్పారు. కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఎన్‌ఎంసీ విధిగా ప్రత్యక్షంగా తనిఖీలు చేస్తుందన్నారు. అనుమతుల కొనసాగింపు సమయంలో వర్చువల్‌గా తనిఖీలు చేసినా.. ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. పీజీ మెడికల్‌ సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వైద్యవిద్య పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చే సమయానికి పూర్తి నైపుణ్యంతో వైద్యవిద్యార్థి ఉండేలా చూడటమే తమ లక్ష్యమంటున్న ఎన్‌ఎంసీ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.ఎన్‌.గంగాధర్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..

వైద్య కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలు..?

దేశంలో మరిన్ని మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యమిస్తూనే.. వైద్యవిద్యలో నాణ్యత పెంపుపై దృష్టి సారించాం. కేవలం థియరీ పరీక్షలతో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించడం కాదు. మెడికల్‌ ప్రాక్టీస్‌లోని అనేక అంశాల్లో విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవడం చాలా కీలకం. ఉన్నత ప్రమాణాలతో కూడిన సిలబస్‌ను అభివృద్ధి చేసి.. దాన్ని తప్పనిసరిగా అనుసరించేలా చేశాం. విద్యార్థులకు క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌ త్వరగా దక్కేలా దృష్టి సారించాం. పాఠ్యాంశాలు నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక(ప్రాక్టికల్‌) విజ్ఞానం పెంపునకు ఇది దోహదపడుతుంది. అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రీక్లినికల్‌ ట్రైనింగ్‌ను క్లినికల్‌ ట్రైనింగ్‌లో భాగం చేశాం. వైద్య కళాశాలల్లో స్కిల్‌ ల్యాబ్‌లను తప్పనిసరి చేశాం. వీటిలో నైపుణ్యాలు పెంచుకునేందుకు విద్యార్థులకు అవకాశాలుంటాయి.

వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది సామర్థ్యాల పెంపు..?

బోధన సిబ్బంది తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం గతం నుంచే అమల్లో ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు 40 నుంచి 45 శాతం శిక్షణ అవకాశాలను పెంచాం. వైద్య కళాశాలలు, బోధన సిబ్బంది సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా శిక్షణ కోసం అనేక కేంద్రాలు ప్రారంభించాం. ప్రధానంగా అడ్వాన్స్‌డ్‌ ఏరియాలోనూ శిక్షణ ఇచ్చే అవకాశాలను కల్పించాం.

ర్యాగింగ్‌ నివారణ..?

వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మెంటార్‌-మెంటీ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రతి కళాశాలలోనూ యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్‌ ఏ రూపంలో ఉన్నా... ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు.

పీజీ మెడికల్‌ సీట్ల కొరత..?

ఎన్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత గత మూడేళ్లుగా పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఐదేళ్ల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు అనేక పీజీ సీట్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ఏడాది, గత ఏడాది బ్యాచ్‌లలోని విద్యార్థులందరూ దాదాపుగా పీజీ సీట్లు పొందేందుకు అవకాశం ఉంది. అయితే పాత బ్యాచ్‌ల వారు సైతం ప్రయత్నిస్తుండటంతో గట్టి పోటీ ఉంది.

నెక్స్ట్‌ నిర్వహణ..?

నేషనల్‌ లెవల్‌ కాంపిటెన్సీ అసెస్‌మెంట్‌ (నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌-నెక్స్ట్‌) నిర్వహిస్తే వైద్యవిద్య ప్రమాణాల పెంపులో గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. అయితే దీని అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఒకసారి దీని నిర్వహణ మొదలైతే విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. అన్ని వైద్య కళాశాలలు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వైద్యవిద్య అందించేందుకు థర్డ్‌ పార్టీ ఆడిట్‌ కూడా ఉంటుంది. దీనిపై ప్రత్యేక కమిటీని నియమించాం. అది అధ్యయనం చేస్తోంది.

మెంటార్‌-మెంటీ పోగ్రాం ఫలితాలు..?

మెంటార్‌-మెంటీ కార్యక్రమంలో మెంటార్‌గా ఉండే బోధన సిబ్బంది నలుగురైదుగురు విద్యార్థులకు లోకల్‌ గార్డియన్‌గా వ్యవహరిస్తారు. ఆ విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ.. వారికి అవసరమైన తోడ్పాటు అందిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని నివారించడంతో పాటు ఇతర అంశాల్లోనూ సహకరిస్తారు. ప్రతి బోధకుడి కింద నాలుగు సంవత్సరాల విద్యార్థులూ ఉంటారు. వారి మధ్య సోదరభావం పెరుగుతుంది. ర్యాగింగ్‌ వంటి వాటికి అవకాశమూ తగ్గుతుంది.

వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యలు, డ్రాపవుట్లు..?

కౌమార దశ తర్వాత వచ్చే విద్యార్థులు చాలా అంశాలకు ఆకర్షితులు కావడం లేదా వాటి వల్ల ప్రభావితం కావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయిని గుర్తించడం, ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోవడం.. ఆత్మహత్యలకు కారణాలు, ఎందుకు డ్రాపవుట్లుగా మారుతున్నారు? వంటి కీలకాంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

రోగులతో వైద్యులు వ్యవహరించాల్సిన తీరు, నైతికత వంటి అంశాలకు ప్రాధాన్యం..?

రోగులతో వైద్యుడు వ్యవహరించాల్సిన తీరుతో పాటు నైతికతను ఒక అంశంగా వైద్యవిద్యలో చేర్చాం. వైద్యవిద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చే విద్యార్థి మంచి వైద్యుడిగా సేవలందించేలా ఇది ఉపకరిస్తుంది. వైద్య వృత్తిని కొనసాగించినంత కాలం ఇవి తోడుగా ఉండేలా దృష్టి సారించాం. దీంతో పాటు ఫ్యామిలీ అడాప్షన్‌ కార్యక్రమమూ అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి వైద్య కళాశాల సమీపంలోని గ్రామంలో నాలుగైదు కుటుంబాలను దత్తత తీసుకుంటారు. నాలుగేళ్ల విద్యాభ్యాసం సమయంలో ఆ కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. ఆ కుటుంబాల అనారోగ్య సమస్యలను గుర్తిస్తారు. వారికి ఆ విద్యార్థులు స్వయంగా వైద్యం చేయరు. ఆసుపత్రి లేదా వైద్య కళాశాలతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల వైద్య విద్యార్థికి అనుభవం వస్తుంది. దీనికంటే ముఖ్యంగా రోగులతో ఎలా మెలగాలో తెలుసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని