144ఏళ్ల చరిత్రకు రెడ్‌ సిగ్నల్‌

సికింద్రాబాద్‌లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది.

Updated : 06 May 2023 09:04 IST

సికింద్రాబాద్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ మూసివేత
ముంబయి, హావ్‌డా, దిల్లీ, చెన్నైలో సైతం...
అయిదు జోన్లలో రైల్వే టికెట్ల ముద్రణ ఔట్‌సోర్సింగ్‌కు

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వుడు, అన్‌రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రించే ఈ ప్రెస్‌ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. బైకులా-ముంబయి (మధ్య రైల్వే), హావ్‌డా (తూర్పు రైల్వే), శకుర్‌బస్తీ-దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం-చెన్నై (దక్షిణ రైల్వే)ల్లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లనూ మూసివేయనుంది. రైల్వే బోర్డు డైరెక్టర్‌ గౌరవ్‌కుమార్‌ ఆయా రైల్వేజోన్ల జనరల్‌ మేనేజర్లకు ఈమేరకు ఉత్తర్వులు పంపించారు. రిలీవ్‌ చేసే ఉద్యోగులను ఇతర విభాగాల్లో నియమించాలని సూచించారు. రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్‌ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్‌రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు. 1870లో నిజాం స్టేట్‌ రైల్వే ఆవిర్భవించింది. 1879లో రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్‌లో ప్రెస్‌ను ఏర్పాటుచేశారు. ప్రారంభంలో 1,500 మంది వరకు ఉద్యోగులుండేవారు. స్వాతంత్య్రానంతరం నిజాం స్టేట్‌ రైల్వే... భారతీయ రైల్వేలో విలీనమైంది. రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్‌ తీసుకురావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ 169కి చేరింది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరడమే రైల్వేశాఖ నిర్ణయానికి కారణం.


నిర్ణయాన్ని 2025 వరకు ఆపాలి..

- మర్రి రాఘవయ్య, ప్రధానకార్యదర్శి, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమన్‌

ప్రింటింగ్‌ ప్రెస్‌లను మూసివేయకుండా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. రైల్వేబోర్డు ఛైర్మన్‌ ఏకే లహోఠితో త్వరలో సమావేశమై తేల్చుకుంటాం. ఇతర ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించడం ద్వారా ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌లను కొనసాగించే అవకాశం ఉంది. మూసివేత నిర్ణయాన్ని కనీసం 2025 వరకు నిలిపివేయాలి. అప్పటికీ లాభాలు రాకపోతే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లపై నిర్ణయం తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని