మాదకద్రవ్యాలపై డేగకన్ను..
తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మరో రెండు కొత్త సంస్థలు ఆవిర్భవించాయి. సైబర్, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్‌న్యాబ్), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ)లు ఏర్పాటయ్యాయి.
సైబర్ నేరాలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో నియంత్రణకు రెండు కొత్త సంస్థలు
ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వ్యవస్థలో మరో రెండు కొత్త సంస్థలు ఆవిర్భవించాయి. సైబర్, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్‌న్యాబ్), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ)లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఈ బ్యూరోలను రాష్ట్ర హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ బ్యూరోల కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాల నేరాలు పెరుగుతున్నాయని, 2022లో 1,270 కేసులు నమోదయ్యాయని తెలిపారు. పెరుగుతున్న సైబర్, మాదకద్రవ్యాల నేరాల నియంత్రణకు ఈ బ్యూరోల ద్వారా అడ్డుకట్ట పడుతుందన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారానే ఈ నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బ్లాక్‌మెయిల్ చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించే సైబర్ నేరగాళ్లపై హత్యకేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బ్యూరోల పనితీరు నేరగాళ్లలో భయం పుట్టించాలన్నారు. కేసుల దర్యాప్తు ఎంతో సవాల్‌తో కూడుకున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త బ్యూరోలు ఆ సమస్యల్ని అధిగమిస్తాయని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. కొత్త బ్యూరోల పనితీరు గురించి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఈ సందర్భంగా.. మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు టీఎస్‌న్యాబ్‌కు కేటాయించిన జాగిలాల పనితీరును మంత్రులు పరిశీలించారు.
టీఎస్‌న్యాబ్..
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సారథ్యంలో 300 మంది పనిచేస్తారు. నలుగురు ఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ, 15 మంది డీఎస్పీలు, 22 మంది ఇన్‌స్పెక్టర్లు, 44 మంది ఎస్సైలు, 126 మంది కానిస్టేబుళ్లు, 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు.
* కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రధాన కార్యాలయంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లలో నార్కోటిక్ పోలీస్‌స్టేషన్లు ఉంటాయి. వీటికి అదనంగా 7 ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు, 26 మాదకద్రవ్యాల నిఘా విభాగాలు పనిచేస్తాయి.
* గతంలోలాగా కేవలం నిందితుల్ని పట్టుకొని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు అప్పగించకుండా టీఎస్‌న్యాబ్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు చేపట్టి అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. టీఎస్‌న్యాబ్‌లో నమోదయ్యే కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేసేందుకు న్యాయశాఖ కసరత్తు చేస్తోంది.
టీఎస్‌సీఎస్‌బీ..
తెలంగాణ రాష్ట్ర సైబర్ ఎకో సిస్టమ్‌ను సురక్షితం చేసేందుకు టీఎస్‌సీఎస్‌బీని అందుబాటులోకి తెచ్చారు.
* సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు. ఇద్దరు ఎస్పీలతోపాటు దాదాపు 300 మంది సిబ్బంది ఉంటారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి నోడల్ వ్యవస్థ ఉంటుంది. దీని పరిధిలో సైబర్‌క్రైమ్ బ్రాంచి, ఆక్సిలరీ యూనిట్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచి, అడ్మిన్ అండ్ లాజిస్టిక్ విభాగాలు పనిచేస్తాయి.
* సైబర్‌క్రైమ్ బ్రాంచిలో ఠాణా, టాస్క్‌ఫోర్స్, ల్యాబ్, టెక్ సపోర్ట్, ఇంటెలిజెన్స్, అకాడమీ, కాల్‌సెంటర్, సెంట్రల్ మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగాలుంటాయి.
* ఆక్సిలరీ యూనిట్ విభాగం పరిధిలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, ఖమ్మం కమిషనరేట్లలో సైబర్‌క్రైమ్ ఠాణాలుంటాయి. వీటికి అదనంగా 21 జిల్లా పోలీస్ యూనిట్లలో సైబర్‌క్రైమ్ సమన్వయ కేంద్రాలతోపాటు సికింద్రాబాద్ జీఆర్పీ యూనిట్లు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?