11న ఘనంగా సాహిత్య దినోత్సవం

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సాహిత్యానికి పెద్దపీట వేస్తూ సాహితీ వైభవాన్ని చాటుతున్నారని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 10 Jun 2023 04:31 IST

ఉత్తమ కవితకు రూ.1,00,116
సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సాహిత్యానికి పెద్దపీట వేస్తూ సాహితీ వైభవాన్ని చాటుతున్నారని సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 11న రాష్ట్రస్థాయిలో సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉర్దూ, తెలుగు భాషల్లో కవి సమ్మేళనాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. ‘‘రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించాలి. ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా రూ.1,00,116, రెండో బహుమతిగా రూ.75,116, మూడో బహుమతిగా రూ.60,116, నాలుగో బహుమతిగా రూ.50,116, అయిదో బహుమతిగా రూ.30,116 నగదు ప్రోత్సాహకాలు అందించాలి. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలతో పుస్తకం తీసుకురావాలి. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులు, సాహితీవేత్తలను సన్మానించాలి’’ అని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని