Trains: కొత్త రైళ్లకు రెడ్‌ సిగ్నల్‌!

తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలకు ఇతర రైల్వే జోన్లు మోకాలడ్డుతున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ, తిరుపతి, నరసాపురం, కాకినాడల నుంచి... జమ్మూ, జైపుర్‌, జోధ్‌పుర్‌, భుజ్‌, బోధ్‌పుర్‌, రాజ్‌కోట్‌, రామేశ్వరం, సోమనాథ్‌, గోవాలోని వాస్కో, మైసూర్‌, కొల్లం, అగర్తల, దిబ్రూగఢ్‌, పూరీ, దానాపుర్‌, దర్భంగా, గోరఖ్‌పుర్‌ వంటి నగరాలకు 21 నూతన రైళ్లకు ప్రతిపాదనలు వెళ్లాయి.

Updated : 19 Jun 2023 09:29 IST

ద.మ.రైల్వే నుంచి 21 బండ్లకు ప్రతిపాదన
దారి ఇవ్వలేమంటున్న ఇతర జోన్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలకు ఇతర రైల్వే జోన్లు మోకాలడ్డుతున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ, తిరుపతి, నరసాపురం, కాకినాడల నుంచి... జమ్మూ, జైపుర్‌, జోధ్‌పుర్‌, భుజ్‌, బోధ్‌పుర్‌, రాజ్‌కోట్‌, రామేశ్వరం, సోమనాథ్‌, గోవాలోని వాస్కో, మైసూర్‌, కొల్లం, అగర్తల, దిబ్రూగఢ్‌, పూరీ, దానాపుర్‌, దర్భంగా, గోరఖ్‌పుర్‌ వంటి నగరాలకు 21 నూతన రైళ్లకు ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిలో కొన్ని రోజువారీ, మరికొన్ని వారానికి రెండు, మూడు రోజులు, ఇంకొన్ని వారానికో రోజు నడపాలనేది ప్రణాళిక. అయితే... చాలావాటికి ఇతర జోన్ల నుంచి ట్రాక్‌ రద్దీ పేరిట అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరికొన్నింటిని రైల్వేబోర్డు, ఐఆర్‌టీటీసీ(ఇండియన్‌ రైల్వే టైంటేబుల్‌ కమిటీ)లు పక్కనపెట్టాయి. జోన్ల మధ్య సమన్వయం తీసుకురావాల్సిన రైల్వే శాఖ విఫలం అవుతోంది.

చుక్కల్లో విమాన టికెట్లు

హైదరాబాద్‌నుంచి దిల్లీ ప్రయాణానికి కొన్ని రోజుల ముందు విమాన టికెట్‌ తీసుకుంటే రూ.5 వేల వరకుఅవుతుంది. అదే ప్రయాణానికి ఒక రోజు, పూట ముందైతే ధర ఏకంగా రూ.15-20 వేలకు పెరుగుతోంది. దిల్లీ నుంచి విజయవాడకు టికెట్‌ ధర రూ.25-30 వేల వరకు వెళుతోంది. రైలులో... సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి స్లీపర్‌లో రూ.695, థర్డ్‌ ఏసీలో రూ.1,825, సెకండ్‌ ఏసీలో రూ.2,625 మాత్రమే అవుతుంది. అయితే... రైళ్లు నేరుగా లేక, రిజర్వేషన్‌ దొరక్క చాలామంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. చాలాసార్లు రద్దు చేసుకుంటున్నారు.

ఇదీ కొన్ని ప్రతిపాదనల తాజా పరిస్థితి

  • సికింద్రాబాద్‌-జమ్మూతావి: జమ్మూ, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌లకు వెళ్లే ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకులకు, సైనిక సిబ్బందికి ఇది ఎంతో ప్రయోజనం. ఐఆర్‌టీటీసీ దీన్ని పక్కనపెట్టింది.
  • సికింద్రాబాద్‌-దానాపుర్‌: వారణాసికి తెలుగువారు పెద్దసంఖ్యలో వెళ్తారు. ఇప్పుడున్న ఒకే రైలు 150-175% ఆక్యుపెన్సీతో నడుస్తోంది. వారానికి రెండ్రోజులు నడిచేలా మరో రైలును ప్రతిపాదిస్తే.. రద్దీ కారణంగా తమ జోన్‌ పరిధిలో అనుమతించలేమని నార్త్‌సెంట్రల్‌ రైల్వే జోన్‌ అడ్డుచెప్పింది.
  • సికింద్రాబాద్‌-గోరఖ్‌పుర్‌: యూపీ రాజధాని లఖ్‌నవూకు నేరుగా రైలు లేదు. సికింద్రాబాద్‌-గోరఖ్‌పుర్‌ మధ్య ప్రస్తుతం వారానికి ఒక రైలు మాత్రమే ఉంది. డిమాండ్‌ ఉండటంతో రోజువారీ నడిపేందుకు ప్రతిపాదించగా పెండింగ్‌లో పెట్టారు.
  • సికింద్రాబాద్‌-దర్భంగా: ప్రస్తుత రైలు వారానికి రెండ్రోజులు 158% ఆక్యుపెన్సీతో నడుస్తోంది. రోజువారీ కావాలన్న ప్రతిపాదన రైల్వేబోర్డులో పెండింగ్‌లో ఉంది.
  • సికింద్రాబాద్‌-అగర్తలా, దిబ్రూగఢ్‌: ఈశాన్య రాష్ట్రాలకు ప్రస్తుతం గువాహటి-సికింద్రాబాద్‌ రైలు వారానికి ఒకరోజు మాత్రమే 211% ఆక్యుపెన్సీతో నడుస్తోంది. కొత్త రైళ్ల ప్రతిపాదన పరిశీలనలోనే ఉంది.
  • కాచిగూడ-పురీ: పురీకి నేరుగా రైలు లేదు. రైల్వేబోర్డు పరిశీలిస్తోంది.
  • నర్సాపూర్‌-జోధ్‌పుర్‌: రాజస్థాన్‌లోని అనేక మంది ఉపాధి కోసం వచ్చి విజయవాడ పరిసరాల్లో ఉంటున్నారు. నర్సాపూర్‌ నుంచి జోధ్‌పుర్‌కు కొత్త రైలు ప్రతిపాదనను ఐఆర్‌టీటీసీ నాలుగేళ్లుగా పక్కనపెడుతోంది.
  • తిరుపతి-భుజ్‌: గుజరాత్‌లోని భుజ్‌, గాంధీధామ్‌కి తిరుపతి నుంచి నేరుగా కొత్త రైలు ప్రతిపాదనను ఐఆర్‌టీటీసీ పక్కనపెట్టింది.
  • కాకినాడ-సోమనాథ్‌: ఏపీలో కోస్తా జిల్లాల నుంచి రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్ని అనుసంధానం చేసే కొత్త రైలు ప్రతిపాదనకు రైల్వేశాఖ అనుమతివ్వడంలేదు.  

రెండు, మూడు రైళ్లు మారితేనే...

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి ప్రజలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లకు హైదరాబాద్‌ నుంచి నేరుగా రైళ్లు లేవు. మొదట దిల్లీకి వెళ్లి, అక్కడ్నుంచి మరో రైలు ఎక్కాల్సి వస్తోంది. కొన్నిసార్లు ప్లాట్‌ఫాంలు, మరికొన్నిసార్లు స్టేషన్లు మారాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని