ఒక్కో పరీక్ష ఒక్కోచోట!.. ఆందోళనలో గురుకుల టీచర్‌ అభ్యర్థులు

గురుకులాల్లో టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు పేపర్‌-1, 2, 3లలో ఒక్కో పేపర్‌కు వేర్వేరు జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 29 Jul 2023 05:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో టీజీటీ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు పేపర్‌-1, 2, 3లలో ఒక్కో పేపర్‌కు వేర్వేరు జిల్లాల్లో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకరోజు ఒక పేపర్‌ పరీక్ష రాసిన అభ్యర్థి ఆ మరుసటి రోజునే వందల కిలోమీటర్ల దూరంలోని మరో పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లగలరని ప్రశ్నిస్తున్నారు. గురుకులాల్లో టీజీటీ పోస్టులకు దాదాపు లక్ష మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు పేపర్‌-1, 2, 3 పరీక్షలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల్ని వేర్వేరు రోజుల్లో నిర్వహించేందుకు గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు చేసింది. అయితే కొందరికి ఒక్కోపేపర్‌కు వేర్వేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు హనుమకొండకు చెందిన ఓ అభ్యర్థికి పేపర్‌-1 పరీక్షకు హైదరాబాద్‌లో, పేపర్‌-2, 3, పరీక్షలకు హనుమకొండలో కేంద్రాలు కేటాయించారు. కొందరికి జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒక్కోపేపర్‌కు ఒక్కో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అభ్యర్థులందరికీ పేపర్‌-1, 2, 3 పరీక్షలకు ఒకే పరీక్ష కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  వేర్వేరు చోట్ల పరీక్ష కేంద్రాలు కేటాయించడంపై గురుకుల బోర్డు వర్గాలు ‘ఈనాడు’కు వివరణ ఇచ్చాయి.

స్లాట్లు లేక.. 1600 మందికి ఈ సమస్య

గురుకుల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో అందుబాటులోని స్లాట్ల కన్నా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారని తెలిపాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఆ మేరకు పరీక్ష కేంద్రాలు కేటాయింపు జరిగిందని వివరించాయి. టీజీటీ హాల్‌టికెట్ల జారీకి ముందుగానే ఈ విషయాన్ని బోర్డు వర్గాలు గుర్తించాయని, దాదాపు 1600 మందికి ఇలా పరీక్ష కేంద్రాలు కేటాయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించాయి. అభ్యర్థులు ఆందోళన చెందకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని, గురుకుల పరీక్షలు వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మకూడదని కోరాయి. నియామకబోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని