వరద నీటికి నడక నేర్పేదెప్పుడు?

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి.

Updated : 31 Jul 2023 05:26 IST

ఏటా మునుగుతున్న నగరాలు, పట్టణాలు
కాల్వలు, నాలాల విస్తరణే పరిష్కారమంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో వర్షం కురిసేసరికి అతలాకుతలం అవుతున్నాయి. హైదరాబాద్‌లో చెరువుల్లో ఆక్రమణలు వెల్లువెత్తుతున్నాయి. అదేసమయంలో గతంలో ఎప్పుడో తక్కువ జనాభా కోసం రూపొందించిన వరద కాల్వలు, నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారీ వరదల ముప్పు తప్పడం లేదు. భారీ వర్షాలు కురిసిన ప్రతి సందర్భంలోనూ హడావుడిగా అధ్యయనాలు చేయించడం.. ఆ తరవాత వాటిని దస్త్రాలకే పరిమితం చేయడం పరిపాటిగా మారింది. వర్షాలు పడ్డప్పుడు హడావుడి కాకుండా.. నగరాలు, పట్టణాల్లో వరద నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ద్వితీయ శ్రేణి నగరాల్లో..

రానున్న రోజుల్లో 50 శాతానికిపైగా ప్రజానీకానికి పట్టణాలే ఆవాసాలు కానుండటంతో ద్వితీయ శ్రేణి నగరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే అవీ హైదరాబాద్‌లా మారతాయన్న ఆందోళనను నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, రామగుండం, ఖమ్మం నగరాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ఆయా నగరాల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు. తాజా వర్షాలతో నిజామాబాద్‌, వరంగల్‌ నగరాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను ప్రభుత్వం పరిరక్షిస్తున్నా.. వాటి నుంచి వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు వరంగల్‌ నగరానికి నాలుగు వైపులా చెరువులున్నాయి. అవి అలుగుపోస్తే పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పటికైనా ఆయా నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థను, నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయిదు సెంటీమీటర్లు దాటితే కష్టమే

కుండపోతగా వర్షం కురిస్తే ఎంతటి నగరమైనా తట్టుకోలేదు. గతంలో హైదరాబాద్‌లో రెండు మూడు సెంటీమీటర్ల వర్షం పడితేనే అస్తవ్యస్తం అయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇటీవల నాలాలు, వరద కాల్వలను కొంత మేర అభివృద్ధి చేసింది. ఫలితంగా గంట వ్యవధిలో అయిదారు సెంటీమీటర్ల వరకు నగరం తట్టుకోగలుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతకుమించి కురిస్తే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నగరాలన్నీ సిమెంటు అరణ్యాలు(కాంక్రీట్‌ జంగిల్స్‌)గా మారుతుండటంతో నీరు ఇంకిపోయే పరిస్థితి లేదు. కేంద్ర భూగర్భ నీటి బోర్డు(సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు) మార్గదర్శకాల మేరకు నగరాల్లో ప్రత్యేకించి హైదరాబాద్‌లో వర్షపు నీటిని భూమిలోకి పంపేందుకు ఇంజెక్షన్‌ వెల్స్‌ ఒక పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో పదేళ్ల కిందటే వాటిని వేయడంతో ఏటా పది కోట్ల లీటర్ల నీటిని భూగర్భంలోకి పంపుతున్నారు. నాలాలు, వరద కాల్వల విస్తరణను దీర్ఘకాలిక ప్రణాళికగా చేపట్టాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.


బఫర్‌జోన్‌లో నిర్మాణాలను అడ్డుకోవాలి

‘తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో వర్షాలు కురవడం ఇటీవల కాలంలో పెరిగింది. నగరాల్లో వరదలకు ఇదే ప్రధాన కారణం. నగరాల్లో పూర్తిస్థాయి వరద కాల్వలు లేకపోవడమే పెద్ద సమస్య’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఎం.గోపాల్‌నాయక్‌ ‘ఈనాడు’తో చెప్పారు. నాలాలు చెత్తాచెదారాలకు అడ్డాలు కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే విషయంలో నీటిపారుదల, ఆర్‌అండ్‌బి, నగరపాలక సంస్థలు, జలమండలి సమన్వయంతో వ్యవహరించాలి. బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించాలి. వరద నివారణకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలు అనుసరించాలి. నాలాల సామర్థ్యం పెంచాలి. వరదను తీసుకెళ్లే ప్రధాన కాల్వను గుర్తించి ప్రారంభం నుంచి చివరి వరకు ఆటంకాలు లేకుండా చూడాలి. వీటికి ఇతర కాల్వలను కలపాలి. వరద ఎక్కడికక్కడ చెరువుల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు